telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమృత కామెంట్స్ పై వర్మ రియాక్షన్

Ramgopal varma

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య, మారుతీరావు, అమృత, ప్రణయ్ నిజజీవిత కథల ఆధారంగా సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సంచలన ప్రకటన చేశాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఫాదర్స్ ‌డే సందర్భంగా ఆదివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాడు. ఈ సినిమాకు `మర్డర్` అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. ఈ ప్రకటనపై అమృత ఆగ్రహం వ్యక్తం చేసింది. `నా జీవితం మరోసారి తలకిందులైంది. ఉపన్యాసాలిచ్చే దర్శకుడికి, మా కథ చెప్పబోయే ముందు మా అనుమతి తీసుకోవాలని తెలియదా? నా జీవితానికీ, ఆ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. ఓ కట్టుకథకు మా పేర్లు పెట్టుకుని అమ్ముకోవాలని చూస్తున్నాడు. ఈ పని వల్ల ఆయనకు పబ్లిసిటీ వచ్చుంటుంది. నా భర్త హత్య జరిగినప్పటి నుంచి చాలా ఒత్తిడి మధ్య భావోద్వేగ జీవితం గడుపుతున్నా. మహిళలను ఎలా గౌరవించాలో చెప్పే తల్లి లేనందుకు అతడిపై జాలిపడుతున్నా` అంటూ వర్మపై అమృత విరుచుకుపడింది.

అమృత వ్యాఖ్యలపై వర్మ తాజాగా ట్విటర్ ద్వారా స్పందించాడు. `మొదట నేను ఓ విషయం స్పష్టం చేయదలచుకున్నాను. `మర్డర్` సినిమా నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోందని చెప్పాను కానీ, నేను తీసిందే నిజమని ఎక్కడా చెప్పుకోలేదు. ఈ `మర్డర్‌`పై చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉండి ఉండొచ్చు. కానీ, నా అభిప్రాయం ఏంటనేది నా సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. ముందుగానే ఆ సినిమాలోని కథ గురించి వ్యాఖ్యానించడం అవివేకం. అలాగే ఈ సినిమాలో కొందరిని చెడ్డవారిగా చూపించబోతున్నానని అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే ఎవరూ చెడ్డవారు కాదు. పరిస్థితులు మాత్రమే మనిషిని చెడుగా ప్రవర్తించేలా చేస్తాయని నేను గట్టిగా నమ్ముతాను. అమృత లేదా ఇంకెవరైనా సరే.. వేదన అనుభవించిన వారిపై నాకు చాలా గౌరవం ఉంది. వారు ఎదుర్కొన్న పరిస్థితులనే `మర్డర్‌` సినిమాలో చూపించబోతున్నాను` అని వర్మ వరుస ట్వీట్లు చేశాడు.

Related posts