telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఆపరేషన్ స్మయిల్ లో భాగంగా 3178 పిల్లలను రక్షించాం : డీజీపీ మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో జనవరి ఒకటవ తేదీ నుండి ఇప్పటి వరకు నిర్వహించిన 7 వ విడత ఆపరేషన్ స్మయిల్ లో భాగంగా 3178 పిల్లలను రక్షించి వారి తల్లి తండ్రులకు అప్పగించడం, రెస్క్యూ హోమ్ లకు తరలించామని డీ.జీ.పీ. ఎం.మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఆపరేషన్ స్మయిల్ ఏడవవిడత కార్యక్రమం ముగింపు కార్యక్రమాన్ని డీజీపీ కార్యాలయంలో నిర్వహించారు. అడిషనల్ డీ.జీ. స్వాతి లక్రా, ఐ. జి. రాజేష్ కుమార్, డీ.ఐ.జి. బి.సుమతి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య లు హాజరైన ఈ కార్యక్రమం సందర్బంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల  మహిళా భద్రతా విభాగం, వివిధ శాఖల అధికారులతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా డీ.జీ.పీ మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాదాన్యత నిస్తున్నామని, దీనిలో భాగంగా 7 విడత ఆపరేషన్ లో రక్షించిన వారిలో 2679 మంది బాలురు, 277 మంది బాలికలున్నారని తెలిపారు. వీరిలో 2188 మంది పిల్లలను వారి తల్లి, తండ్రులకు అప్పగించామని అన్నారు. కోవిడ్ సమయం లోనూ ఇంత పెద్ద సంఖ్యలో పిల్లలను గుర్తించడం పట్ల అధికారులను అభినందించారు. రాష్ట్రంలో 2014 నుండి 2020 వరకు 17224 చైల్డ్ మిస్సింగ్ కేసులు నమోదుకాగా వీరిలో 12807 మందిని రక్షించామని వివరించారు. ఆపరేషన్ ముస్కాన్, స్మయిల్ కార్యక్రమాల్లో గుర్తించిన వారిని సంబంధిత తల్లి తండ్రులకు అప్పగించడం, పునరావాస సౌకర్యాలను కల్పించేందుకు సంబంధిత శాఖలు మరింత సమన్వయము తో పని చేయాలని డీజీపీ అన్నారు. ఈ సందర్బంగా ఆపరేషన్ స్మయిల్ -7 కార్యక్రమాలపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని డీ. జీ. పీ ఆవిష్కరించారు. ఈ స్మైల్ 7 లో ఉత్తమ ప్రతిభ చూపించిన సైబరాబాద్ యాంటి ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎస్. ఐ. రేణుకను, పెద్ద సంఖ్యలో తప్పిపోయిన వారిని గుర్తించిన హైదరాబాద్, నారాయణపేట టీమ్ లకు ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికను మహేందర్ రెడ్డి అంద చేశారు.

Related posts