telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ : ఢిల్లీ మరో ఘనవిజయం ..

ఐపీఎల్‌-12లో దిల్లీ, బౌలింగ్‌లో సందీప్‌ లమిచానె (3/40), కాగిసో రబాడ (2/23), అక్షర్‌ పటేల్‌ (2/22).. బ్యాటింగ్‌లో శిఖర్‌ ధావన్‌ (56; 41 బంతుల్లో 7×4, 1×6), శ్రేయస్‌ అయ్యర్‌ (58 నాటౌట్‌; 49 బంతుల్లో 5×4, 1×6) సత్తా చాటడంతో మరో విజయం సాధించింది. ఆ జట్టు 5 వికెట్ల తేడాతో పంజాబ్‌పై నెగ్గింది. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. క్రిస్‌ గేల్‌ (69; 37 బంతుల్లో 6×4, 5×6) మెరుపులు మెరిపించినా.. మిగతా బ్యాట్స్‌మెన్‌కు దిల్లీ బౌలర్లు కళ్లెం వేశారు. అనంతరం దిల్లీ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పృథ్వీ షా (13) త్వరగా ఔటైనా.. ధావన్‌, అయ్యర్‌ నిలకడగా ఆడి జట్టును గెలుపు బాటలో నడిపించారు. అయ్యర్‌ నెమ్మదిగా ఆడగా.. ధావన్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌ చేశాడు. 13 ఓవర్లకు 111/1తో దిల్లీ పటిష్ట స్థితిలో నిలిచింది. ఐతే తర్వాతి ఓవర్లో ధావన్‌ ఔటయ్యాడు. కాసేపటికే పంత్‌ (6) కూడా వెనుదిరిగాడు. అయినప్పటికీ ఇంగ్రామ్‌ (19; 9 బంతుల్లో 4×4) దూకుడుతో దిల్లీ చివరి 2 ఓవర్లలో 10 పరుగులే చేయాల్సి ఉండటంతో గెలుపు లాంఛనమే అనిపించింది. ఐతే 19 ఓవర్లో షమి.. ఇంగ్రామ్‌ను ఔట్‌ చేయగా, అక్షర్‌ (1) రనౌటయ్యాడు. ఈ ఓవర్లో 4 పరుగులే రావడంతో ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లో 3 బంతులకు 4 పరుగులు రాగా.. నాలుగో బంతికి ఫోర్‌ కొట్టి దిల్లీ విజయాన్ని పూర్తి చేశాడు అయ్యర్‌.

పంజాబ్‌ ఇన్నింగ్స్‌కు గేల్‌ మంచి ఊపు ఇచ్చినా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో ఆ జట్టు ఓ మోస్తరు స్కోరుతో సరిపెట్టుకుంది. ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికీ గేల్‌ మాత్రం చెలరేగి ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సందీప్‌ లమిచానె వేసిన రెండో ఓవర్లోనే కేఎల్‌ రాహుల్‌ (12) స్టంపౌటైపోగా.. మయాంక్‌ అగర్వాల్‌ (2)ను రబాడ, డేవిడ్‌ మిల్లర్‌ (7)ను అక్షర్‌ పెవిలియన్‌ చేర్చారు. ఐతే గేల్‌ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. లమిచానె వేసిన ఒక ఓవర్లో నాలుగు ఫోర్లు బాదిన గేల్‌.. మిశ్రా బౌలింగ్‌లో మూడు సిక్సర్లు కొట్టాడు. 25 బంతుల్లోనే అతడి అర్ధశతకం పూర్తయింది. ఐతే 13వ ఓవర్లో తొలి బంతికి సిక్సర్‌ బాదిన గేల్‌ను తర్వాతి బంతికి ఔట్‌ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు లమిచానె. అప్పటికి స్కోరు 106. అదే ఓవర్లో కరన్‌ (0) కూడా ఔటవడంతో పంజాబ్‌ ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. గేల్‌ ఉన్నంతసేపు 180 దాటేలా కనిపించిన పంజాబ్‌.. మన్‌దీప్‌ (30), అశ్విన్‌ (16), హర్‌ప్రీత్‌ (20 నాటౌట్‌) తలో చేయి వేయడంతో 160 దాటగలిగింది.

గేల్‌ ఉన్నంతసేపూ భారీ స్కోరు చేసేలా కనిపించిన పంజాబ్‌.. అతను ఔటయ్యాక గాడి తప్పి 163 పరుగులకు పరిమితమైంది. గేల్‌ క్యాచ్‌ ఆసక్తి రేకెత్తించింది. సందీప్‌ లమిచానె బౌలింగ్‌లో ఓ సిక్సర్‌ బాదిన గేల్‌.. ఇంకో భారీ షాట్‌కు ప్రయత్నించగా డీప్‌ మిడ్‌వికెట్లో బౌండరీ ఆవల పడేలా కనిపించిన బంతిని ఇంగ్రామ్‌ కష్టపడి అందుకున్నాడు. అయితే బ్యాలెన్స్‌ చేసుకోలేకపోయిన అతను.. రెప్పపాటు కాలంలో తనకు సమీపంలో ఉన్న అక్షర్‌ను గుర్తించి బంతి విసరగా అతను అందుకున్నాడు. ఇది ఆటకు మంచి మలుపు అయ్యింది.

delhi won on punjab in ipl 2019 matchనేటి మ్యాచ్ : హైదరాబాద్ vs కలకత్తా సాయంత్రం 4 గంటలకు; రాజస్థాన్ vs చెన్నై రాత్రి 8 గంటలకు జరుగుతాయి.

Related posts