telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“డియర్ కామ్రేడ్” మా వ్యూ

Dear-Comrade

బ్యానర్ : మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్‌
న‌టీన‌టులు : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా, సుహాస్‌, చారుహాస‌న్‌ త‌దిత‌రులు
దర్శ‌క‌త్వం : భ‌ర‌త్ క‌మ్మ‌
సంగీతం : జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్‌
కెమెరా: సుజిత్ సారంగ్
ఎడిటింగ్, డి.ఐ : శ‌్రీజిత్ సారంగ్‌
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని

కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం “‘డియ‌ర్ కామ్రేడ్‌”. “గీత‌గోవిందం”లో రష్మిక, విజయ్ ల జంటకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో కూడా వీరిద్దరూ కలిసి నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాలో హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ అండ్ ఎమోష‌న్స్‌ను మాత్ర‌మే కాకుండా మంచి మెసేజ్ కూడా ఉంటుంద‌ని చిత్రబృందం చెప్పుకొచ్చారు. అస‌లు డియ‌ర్ కామ్రేడ్‌ అంటే అర్థ‌మేంటి? దర్శకుడు ఇవ్వాలనుకున్న ఆ మెసేజ్ ఏంటి ? ఈ సినిమాను ఏకంగా నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో విడుద‌ల చేసిన విజయ్ దేవరకొండ ఎలాంటి హిట్ ను అందుకున్నాడు ? అనేది తీయాలంటే ముందు కథలోకి వెళదాము.

కథ :
కళ్ళముందు ఏదైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడు చైత‌న్య అలియాస్ బాబీ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌). తన కుటుంబంతో వైజాగ్‌లో నివాసం ఉండే బాబీ కాలేజ్ స్టూడెంట్ లీడ‌ర్. బాబీ దూకుడు స్వ‌భావాన్ని అత‌ని స్నేహితులు, త‌ల్లిదండ్రులకు బాగా తెలుసు. ఇక అప‌ర్ణా దేవి అలియాస్ లిల్లీ (ర‌ష్మిక మంద‌న్న) స్టేట్ క్రికెట్ ప్లేయ‌ర్‌. బాబీ వాళ్ల ఎదురింట్లో లిల్లీ వాళ్ల బంధువులు ఉంటారు. ఓసారి బంధువుల ఇంటికి లిల్లీ వ‌స్తుంది. తొలిచూపులోనే బాబీ లిల్లీని ప్రేమిస్తాడు. లిల్లీ కూడా బాబీని ప్రేమిస్తుంది. గొడ‌వ‌లంటే భయపడే లిల్లీ బాబీని గొడవలకు దూరంగా ఉండమని కోరుకుంటుంది. కానీ ఈ విషయంలో బాబీ ఆమె మాటలు వినకపోవడంతో ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు వస్తాయి. దాంతో బాబీకి లిల్లీ దూరంగా వెళ్లిపోతుంది. అది తట్టుకోలేక బాబీ దేశం మొత్తం టూర్ తిరుగుతూ, సౌండింగ్ థెర‌పీ మీద రీసెర్చ్‌ చేస్తూ మూడేళ్లు అసలు ఇంటికే రాడు. ఆ మూడేళ్ళలో బాబీకి ఎదురైన పరిస్థితులేంటి ? తిరిగొచ్చాక బాబీ లిల్లీని కలుసుకున్నాడా ? బాబీ దూరంగా ఉన్న రోజుల్లో లిల్లీ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంది ? చివ‌ర‌కు లిల్లీకి జ‌రిగిన అన్యాయంపై బాబీ ఎలాంటి పోరాటం చేస్తాడు ? అనే విష‌యాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ యూనియ‌న్ లీడ‌ర్ పాత్ర‌లో న‌టించాడు. ఒక‌వైపు కోపంగా ఉంటూ పోరాటం చేస్తూనే, మ‌రోవైపు ల‌వ‌ర్ బాయ్ లా మెప్పించాడు. సినిమా ద్వితీయార్థంలో కూడా రెండు షేడ్స్‌లో నటించాడు. మొత్తానికి విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న‌దైన స్టైల్లో బాబీ పాత్ర‌కు న్యాయం చేశాడు. ఇక లిల్లీ అనే లేడీ క్రికెట‌ర్ పాత్ర‌లో ర‌ష్మిక జీవించేసింది. స‌మాజంలో ప్ర‌స్తుతం మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న స‌మస్య‌ల్లో ఓ సమస్యను ఎదుర్కొన్న బాధితురాలిగా రష్మిక ఒదిగిపోయింది. ఇక చారుహాస‌న్‌, క్రికెట్ చీఫ్ సెల‌క్ట‌ర్ పాత్ర‌ధారి, సుహాస్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌ పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
మ‌నం ఇష్ట‌ప‌డే దాని కోసం పోరాటం చేయాలి అనే ఓ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని, ప్ర‌స్తుతం మ‌హిళా క్రీడాకారులు ఎదుర్కొంటున్న‌స‌మ‌స్య‌ల‌ను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ. అయితే దర్శకుడు సరికొత్త పాయింట్ ను తీసుకున్నా… దాన్ని ప్రేక్షకులను ఆకట్టుకునేలా చెప్పడంలో ద‌ర్శ‌కుడు పూర్తిగా విఫలం అయ్యఉడ్. అంతేకాదు హీరో హీరోయిన్లకు ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడు. బ‌ల‌మైన ఎమోష‌న్స్ లేవు. సినిమా నెమ్మదిగా, సాగదీతగా అన్పిస్తుంది. ఇక జస్టిన్ ప్ర‌భాక‌రన్ సంగీతంలో మూడు మెలోడీ సాంగ్స్ బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. సుజిత్ సారంగ్ కెమెరా ప‌నిత‌నం బావుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 2.5/5

Related posts