telugu navyamedia
క్రీడలు వార్తలు

నటరాజన్‌పై వార్నర్ ప్రశంసల జల్లు…

టీమిండియా బౌలింగ్ సెన్సేషన్ టీ నటరాజన్‌పై ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల జల్లు కురిపించాడు. నట్టూ ఓ లెజెండని, ఆఫ్ ఫీల్డ్, ఆన్ ఫీల్డ్‌లో అతను ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడని కొనియాడాడు. ఐపీఎల్‌లో నటరాజన్‌కు కెప్టెన్‌గా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, అతని ప్రదర్శన పట్ల గర్విస్తున్నానని తెలిపాడు. ఇక ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు నటరాజన్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. గత సీజన్‌లో తనదైన యార్కర్లతో ఆకట్టుకున్న నటరాజన్.. నెట్‌బౌలర్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. ఆ తర్వాత ఊహించని విధంగా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసి తన సత్తా చాటాడు. ‘మొదట నట్టూకు ఇవే నా అభినందనలు.. నువ్వు నిజంగా జీనియస్‌. ఐపీఎల్‌లో నీతో కలిసి ఆడినప్పుడు నీ మీద ఏ ఫీలింగ్‌ అయితే ఉండేది దాన్ని నిలబెట్టుకున్నావు. మ్యాచ్‌ వరకు మాత్రమే మనద్దిరం ప్రత్యర్థులం.. ఆఫ్‌ ఫీల్డ్‌లో మాత్రం ఎప్పటికి మంచి స్నేహితులం అన్న విషయం గుర్తుపెట్టుకో. నీలాంటి ఆటగాడికి నేను కెప్టెన్‌గా ఉన్నందుకు గర్విస్తున్నా. నిజంగా నటరాజన్‌ మంచి నిజాయితీ ఉన్న వ్యక్తి.. వికెట్‌ తీయగానే తన గొప్పతనాన్ని ప్రదర్శించకుండా హుందాగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు.

ఎంతో ప్రతిభ ఉన్న నట్టూ ఐపీఎల్‌-2020 సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత భారత జట్టుతో కలిసి నెట్ బౌలర్‌గా వెళ్లాడు. తొలిసారిగా తండ్రయిన అతను.. తన కూతురుని చూడకుండా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. గొప్ప ఘనత సాధించాడు.నటరాజన్‌ విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ అతను సత్తా చాటుతాడని ఆశిస్తున్నా. ఏ పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలో నట్టూకి తెలుసు. గత సీజన్‌లో దాదాపు 80 యార్కర్లను కచ్చితత్వంతో విసిరాడు. అతను డెత్‌ ఓవర్లలో అసాధారణమైన తీరుతో బౌలింగ్ చేస్తాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని గురువారం స్వదేశానికి తిరిగొచ్చిన నటరాజన్‌కు ఘన స్వాగతం లభించింది. అతని స్వస్థలం చిన్నప్పంపట్టిలో అభిమానులు పూల వర్షం కురిపించారు. రథంపై ఊరేగిస్తూ సంబరాలు చేసుకున్నారు. దీనిపై వార్నర్‌ మాట్లాడుతూ.. ‘నట్టూకు లభించిన ఆ ఘన స్వాగతాన్ని చూశాను. ఎంతో ఆనందంగా ఉంది. అతను సాధించిన ఘనతకు ఇది మంచి స్వాగతం’ అని తెలిపాడు. ఇక తదుపరి సీజన్ కోసం నట్టూను హైదరాబాద్ రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.

Related posts