telugu navyamedia
సినిమా వార్తలు

రజినీకాంత్ “దర్బార్” హాలీవుడ్ సినిమాకు కాపీ ?

Darbar

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రజినీకాంత్ తదుపరి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘దర్బార్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాదు సినిమా ఫస్ట్‌లుక్‌ను సైతం విడుదల చేశారు. ఇందులో రజనీకాంత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నారు. ముంబయి నేపథ్యంలో సినిమా సాగుతుందని ఫస్ట్‌లుక్‌ను చూస్తే అర్థమవుతోంది. అయితే ర‌జ‌నీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ హాలీవుడ్ మూవీ పోస్ట‌ర్ కాపీ అంటూ సోషల్ మీడియాలో ర‌చ్చ మొదలైంది.

గతంలో మురుగ‌దాస్ తెర‌కెక్కించిన గ‌త చిత్రాలు తుపాకి, కత్తి సినిమాలు కూడా హాలీవుడ్‌కి కాపీ అని అప్ప‌ట్లో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రూపొందనున్న “దర్బార్” చిత్రం ఫ‌స్ట్ లుక్‌ హాలీవుడ్‌లో 2017లో వచ్చిన కిల్లింగ్ గంథర్ సినిమా పోస్టర్ నుంచి కాపీ చేశారని, ఆ పోస్టర్ ను ఆధారంతో సహా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. కిల్లింగ్ గంథర్ సినిమాలో ఆర్నాల్డ్ ష్వాట్జ్‌నెగ్గర్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ఈ విషయమై ఈ పోస్టర్ డిజైనర్ విన్సీ రాజ్ ని సంప్రదించగా ఆయన ఈ ఆరోపణలని ఖండించారు. తాను చాలా నిజాయితీగా ఈ పోస్టర్ డిజైన్ చేశానని, తాను రజినీకాంత్ కు వీరాభిమానినని, కొందరు కావాలనే తనను అప్రతిష్ఠపాలు చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా… అందుకోసం ముంబయిలో భారీ సెట్‌ ఏర్పాటు చేశారు. ఇటీవల సినిమా ఫొటోషూట్‌ చిత్రాలు లీకైన విషయం తెలిసిందే. 30 రోజుల పాటు అక్కడ తొలి షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇందులో రజనీకాంత్‌కు జోడీగా నయనతార నటిస్తోంది. మరో హీరోయిన్‌ కూడా నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఓ అగ్రనాయికతో చర్చలు జరుగుతున్నాయి. నివేదా థామస్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కన్పించబోతున్నట్టు తెలుస్తోంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది.

Related posts