సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఫోన్ ద్వారా వాయిస్ రికార్డింగ్ పంపించి బ్యాంక్ ఖాతాలోని డబ్బులు మాయం చేస్తున్నారు. నాలుగును నొక్కండని ఓ నంబరు నుంచి వచ్చిన వాయిస్ రికార్డింగ్ విని ఆ సంఖ్యను నొక్కగానే ఓ వ్యక్తి ఖాతాలో రూ.15వేలు మాయమైన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరులో శనివారం చోటు చేసుకుంది.
స్థానిక గుడియాత్తం రోడ్డులో ఆదెప్ప అనే వ్యక్తి మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. బ్యాంకులో మీకు ఏదైనా సమస్యలుంటే తెలుసుకోవచ్చునని శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు అతని మొబైల్కు 02264427800 అనే నంబరు నుంచి వాయిస్ రికార్డింగ్ వచ్చింది. తెలుగులో సమాచారం వినేందుకు 4 నొక్కాలని చెప్పడంతో అతను అలాగే చేశాడు. ఇంతలో కాల్ కట్ అయి నిమిషాల వ్యవధిలో అతని ఖాతా నుంచి డబ్బులు డ్రా అవుతున్నట్టు ఎస్ఎంఎస్లు వచ్చాయి. దీంతో బాధితుడు బ్యాంకుకు పరుగులు తీసి తన ఖాతాను బ్లాక్ చేయించాడు. ఆలోపే 40 లావాదేవీలు జరిగి అతని ఖాతాలోని 15వేలు డ్రా అయ్యాయి.