telugu navyamedia
రాజకీయ వార్తలు

వ్యాక్సిన్ వ్యవహారంపై స్పందించిన సీతారాం ఏచూరి

seetharam echury cpm

ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తున్నామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి వ్యాక్సిన్ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. డీసీజీఐ అనుమతి లేకుండా వ్యాక్సిన్ ఆవిష్కరణ తేదీని ఐసీఎంఆర్ ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. శాస్త్ర ఆవిష్కరణలను మెడపై కత్తి పెట్టి పొందాలనుకోవడం తగదని స్పష్టం చేశారు. ఈ వైరస్ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడేది నిర్ణయాత్మక శక్తి వ్యాక్సిన్ మాత్రమేనని తెలిపారు.

ప్రపంచంలో ఎక్కడైనా ఉపయోగించుకునే వీలున్న సురక్షితమైన టీకా కోసం అన్ని దేశాలు ఎదురుచూస్తున్నాయని పేర్కొన్నారు. కానీ శాస్త్రీయ పురోగతిని ఆదేశాలతో శాసించాలనుకోవడం సరైన విధానం కాదని వివరించారు. కరోనా నివారణకు దేశీయంగా వ్యాక్సిన్ తయారు చేయాలనుకునే క్రమంలో అన్ని రకాల ఆరోగ్య, భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రకటన కోసం మానవ ప్రాణాలను పణంగా పెడుతున్నారని సీతారాం ఏచూరి ఆరోపించారు.

Related posts