telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

న్యూఢిల్లీ : … కశ్మీర్ కు … సీతారాం ఏచూరి.. సుప్రీం అనుమతి..

cpi leader sitaram to jammu and kashmir

సుప్రీంకోర్టు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జమ్ముకశ్మీర్‌కు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. సీపీఎం మాజీ ఎమ్మెల్యే తరిగామిని కలుసుకునేందుకు మాత్రమే పరిమితం కావాలని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌లు ఎస్‌ఏ బాబ్డే, ఎస్‌ఏ నజీర్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. అలాగే జామియా మిలియా ఇస్లామియా కేంద్ర యూనివర్సిటీ విద్యార్థి మహ్మద్‌ అలీం సయ్యద్‌ కూడా కశ్మీర్‌కు వెళ్లేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న తమ పార్టీ సహచరుడు తరిగామిని మెరుగైన వైద్య సేవల కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏచూరి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఇప్పుడిప్పుడే కశ్మీర్‌లో సాధారణ పరిస్థితి నెలకొంటున్నదని, ఏచూరిని అనుమతినిస్తే కశ్మీర్‌లో ‘అపాయకర పరిస్థితులకు దారి తీయొచ్చని కేంద్రం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చేసిన వాదనను న్యాయస్థానం పక్కనబెట్టింది.

మెహతా వ్యాఖ్యలపై చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ స్పందిస్తూ.. ఈ దేశంలోని ఒక పౌరుడు అక్కడికి వెళ్లాలని, అతడి స్నేహితుడు, పార్టీ సహచరుడ్ని కలువాలని కోరుకుంటే మీకెందుకు ఇబ్బంది? అని ప్రశ్నించారు. ఏచూరి పర్యటన రాజకీయంగా కనిపిస్తున్నదని మెహతా పేర్కొన్నారు. తరిగామి ఆరోగ్య పరిస్థితిపై వైద్య రికార్డులను న్యాయస్థానానికి ముందు సమర్పిస్తామన్నారు. తరిగామికి జడ్‌ ప్లస్‌ క్యాటగిరీ భద్రత ఉన్నదని వాదించారు. దీంతో ఏచూరి తన పర్యటన తరిగామిని కలుసుకునేందుకే పరిమితం కావాలని, ఒకవేళ ఏ ఇతర కార్యక్రమాలకు పాల్పడినా ఈ కోర్టు ఉల్లంఘనే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏచూరి తరపు న్యాయవాది రాజు రామచంద్రన్‌ స్పందిస్తూ.. తరిగామిని ఏచూరి కలుసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని మాత్రమే తెలుసుకుంటారని చెప్పారు. తరిగామితో ఈ నెల 4న చివరిసారిగా మాట్లాడానని, ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పారని ఏచూరి తెలిపారు. కశ్మీర్‌కు వెళ్లి వచ్చిన తర్వాత అక్కడేం చేశారో అఫిడవిట్‌ సమర్పించాలని ఏచూరికి ధర్మాసనం ఆదేశించింది. జామియా యూనివర్సిటీ విద్యార్థి మహమ్మద్‌ అలీం సయ్యద్‌కు కశ్మీర్‌ వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. కశ్మీర్‌ లోయలో ఆంక్షలు విధించిన తర్వాత తన తల్లిదండ్రులను చూడలేదని సయ్యద్‌ తన పిటిషన్‌లో తెలిపారు. దీంతో అనంత్‌నాగ్‌కు వెళ్లేందుకు సయ్యద్‌కు తగిన భద్రత కల్పించాలని జమ్ముకశ్మీర్‌ యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది.

Related posts