telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

తెలంగాణ : విద్యావ్యవస్థలో … కార్పొరేట్.. దిశానిర్దేశం..

AP Govt. released special Dsc Shedule

విద్య అంటే కేవలం పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం అవలేదు, ఇంకా చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. సమాజ దిశను నిర్ధారించడంలో విద్యావ్యవస్థ ముఖ్య భూమిక పోషిస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో అంశాలను ప్రభావితం చేయగలిగిన విద్యా వ్యవస్థ దశ దిశ లేకుండా సాగిపోతుంది. మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లు చిన్నప్పటి నుండే విద్యార్థులకు క్రమశిక్షణ, వినయం, విధేయత, దేశభక్తి సామాజిక సేవ మరియు దేశాభివృద్ధి వంటి పలు అంశాలను విద్యతో పాటుగా రంగరించి అందించినప్పుడే సార్థకత చేకూరుతుంది. అందుకే విలువలతో కూడిన నాణ్యమైన వ్యవస్థను నిర్మిస్తేనే ఆ దేశం, ఆ సమాజం పురోగమిస్తుంది.

తెలంగాణాలో మార్కులే కొలమానం :

తెలంగాణ విషయానికివస్తే గత దశాబ్ద కాలంగా పదవ తరగతి మరియు ఇంటర్ మార్కులను ప్రామాణికంగా తీసుకోవడం, వాటిని ఆధారంగా చేసుకుని తెలివితేటలను బేరీజు వేసే ఒక అశాస్త్రీయ ప్రక్రియకు తెరలేచింది. మొదట కార్పొరేట్ పాఠశాలల ప్రచార నిమిత్తం మొదలైన ఆ విషబీజం నేడు విష వృక్షముగా మారి పిల్లలను మానసికంగా కృంగదీయడమే కాకుండా ఆత్మన్యూనతా భావానికి గురిచేసి ఆత్మహత్యల వైపు పయనించేలా చేస్తున్నాయి. వందలకొద్దీ శాఖలు తెరచి కేవలం మార్కులు సాధించడమే లక్ష్యముగా పని చేస్తూ విద్యార్థుల స్వేచ్ఛ మరియు బాల్యాన్ని పూర్తిగా హరిస్తున్నాయి.

నాడు… నేడు..:

దశాబ్దంన్నర క్రితం పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉండేవి. ఫలితాలు వెల్లడైన రోజు పేపర్లో మన హాల్ టికెట్ సంఖ్య ఉంటె చాలు అనుకునే రోజులవి. ఆ తరువాత తృతీయ, ద్వితీయ మరియు ప్రథమ శ్రేణి అని వెతుక్కునేది. అరవై శాతం మార్కులు దాటితే ప్రథమ శ్రేణి… అక్కడికే ఉబ్బి తబ్బిబ్బై పోయేది విద్యార్థులు. మరి నేడు… 9.8 GPA (95% పైగా మార్కులు) వచ్చినా 10 GPA రాలేదని పక్కవాళ్లతో పోల్చుకుని బాధపడుతున్నారు. ఒక్క మార్కు తగ్గినా తట్టుకోలేని స్థితిలో విద్యార్థులు, తల్లి తండ్రులు ఉన్నారు. తొమ్మిదవ తరగతి పూర్తయిన రోజు మొదలుకుని పరుగు…. పరుగు…. పరుగు…. మార్కులకోసం చదివిందే చదివి, రాసిందే రాసి, బట్టీ పట్టి…. ఎలాగైనా సరే ప్రతి మార్కు సాధించాలనే తపన తప్ప విషయం అర్థం చేసుకోవాలన్న ధ్యాసే లేదు.

నాందీ :

ఎప్పుడైతే ఆంధ్రా కార్పొరేట్ పాఠశాలలు మరియు కళాశాలలు తెలంగాణలో శాఖోపశాఖలుగా విస్తరించడం ప్రారంభించాయో…. ఆరోజు నుండి మార్కుల తపస్సు ప్రారంభమైనది. పాఠశాలల ప్రచారం కొరకు మరియు పేరును దిగుణీకృతం చేసుకోవడం కొరకు పుట్టగొడుగుల్లా శాఖలు తెరచి విద్యార్థులను మనుషులు అని మరచి మరయంత్రాలుగా భావించి రోజుకు 12 నుండి 14 గంటలు సెలవు దినాలను కూడా వదలకుండా చదివిస్తున్నాయి. ఈ ఒక్క ఉదాహరణ చాలు పిల్లలు వాళ్ళ బాల్యములో ఏం కోల్పుతున్నారో, ఎంత కోల్పోతున్నారో అర్థం చేసుకోవడానికి. వేసవి సెలవులు, పండగ సెలవులు మరియు సాయంకాలం ఆటలు ఇవేవీ లేకుండానే పిల్లల బాల్యం మోడువారిపోతుంది. ఇక ఈ కార్పొరేట్ పాఠశాలలు వచ్చిన ఫలితాలలో మేమంటే మేము గొప్ప అని ప్రచారం చేసుకుంటూ పేద, మధ్య మరియు ధనిక భేదాలు లేకుండా ప్రతీ తల్లితండ్రులను ఆకర్షించడం మరియు లక్షల కొద్దీ ఫీజులు దండుకోవడం తంతుగా మారింది. నెమ్మది నెమ్మదిగా పదికి పది (GPA) రావాలని తల్లితండ్రులు కూడా భావించడం, అందుకు అణుగుణంగా పెద్ద పేరున్న పాఠశాలలను ఎంచుకోవడం సంప్రదాయంగా మారింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని ఈ సంప్రదాయం మన తెలంగాణాకు శాపంగా మారింది.

పది రాకుంటే పనికి రారా..!

ముందు మనందరం ఈ భ్రమనుండి బయటపడాలి. పదవ తరగతి పాసయితే చాలు పై తరగతులు చదవడానికి ఎన్ని మార్కులతో పాసైనా పెద్దగా తేడా ఏమి ఉండదు. బాసర IIIT లాంటి ఒకటీ అర కాలేజీలు తప్ప మార్కులు (GPA) ఆధారంగా సీట్లు లభించే అవకాశం లేనేలేదు. ఒకవేళ ఫెయిల్ అయినా విద్యాసంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసి పై తరగతులకు వెళ్ళవచ్చు, లేదా రాసిన పరీక్ష మీద నమ్మకం ఉంటే రీ వెరిఫికేషన్ / రీ వాల్యుయేషన్ కూడా చేసుకోవచ్చు.

అసలేం జరుగుతుంది !

పరీక్షల నిర్వహణ నుండి పేపర్ దిద్దే వరకు గతంతో పోలిస్తే ప్రమాణాలు పూర్తిగా తగ్గిపోయాయి. మాస్ కాపీయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. సంవత్సరం కష్టపడి చదివిన విధ్యార్థులకన్నా ఆ 11 రోజులు పక్కాగా కాఫీ చేసిన వారికే ఎక్కువ గ్రేడు వస్తుంది. పేపర్ దిద్దడంలో కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరించడంవలన మార్కుల పర్శంటేజీ పెరిగింది కానీ విద్యార్థుల చదువులలో మాత్రం కాదు. ప్రభుత్వ నివేదికల ప్రకారం 7వ తరగతి వరకు చదవడం, రాయడం రాని విద్యార్థులు పదవ తరగతికి వచ్చేసరికి 9కి పైగా GPA ( 5,52,570 విద్యార్థులకు గాను 1,06,387 విద్యార్థులు 9కి పైగా GPA) సాధించడం ఆశ్చర్యానికి గురిచేసే విషయమే. అంత మాత్రాన మిగతా 4.5 లక్షల విద్యార్థులు ప్రతిభావంతులు కారని చెప్పడం సరికాదు. ఒక్కొక్క మనిషిలో ఒక్కో కళ దాగి ఉంటుంది. తల్లితండ్రులుగా మరియు ఉపాధ్యాయులుగా అది వెలికి తీయడం మన బాధ్యత, కానీ అది మరచి మనం పిల్లలను మార్కుల యంత్రాలుగా, మరబొమ్మలుగా మారుస్తున్నాం. విలువల వృక్షాన్ని నరికి, మార్కుల మొక్కలకు నీళ్లు పోస్తున్నాం. 2018-19 సంవత్సరంలో 5,52,570 విద్యార్థులు పరీక్షలు రాయగా 8,676 విద్యార్థులు 10/10 GPA సాధించగా కార్పొరేటు పాఠశాలలు వేళల్లో సాధించామని తప్పుడు ప్రచారాలు ప్రారంభించాయి. అంత ఖచ్చితంగా 11 పేపర్లు ఒక్క తప్పు లేకుండా ఎవరైనా రాయగలరా అని మనం కూడా ఆలోచించాలి.

పల్లె పల్లెకూ కార్పొ’రేటు’ !

మొదట పట్టణాలకే పరిమితమైన ఈ విష సంస్కృతి, మెల్లగా తెలంగాణలోని ప్రతీ పల్లెకు విస్తరించింది. ధనిక వర్గాల పిల్లలను రెసిడెన్షియల్ లో చదివిస్తుండగా పేద మరియు మధ్య తరగతి వారినీ వదలకుండా ప్రతీ ఊరికీ బస్సులు పంపి వారియొక్క పాఠశాలలకు తరలిస్తున్నారు. తోటి విద్యార్థులు పెద్ద పాఠశాలలకు వెళ్తున్నారు అని నా పిల్లలు కూడా పెద్ద పాటశాలలో చదవాలనే అపోహతో తల్లితండ్రులు అప్పు చేసి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు. రోజుకు నాలుగు నుండి ఐదు గంటల ప్రయాణం చేస్తూ విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నా పట్టించుకునే నాధుడే లేదు. పొద్దున 6గంటలకు లేచి తయారై బయలుదేరిన తమ పిల్లలు తిరిగి రాత్రి 7గంటలకు చేరుకుంటున్నా కూడా తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. 30కి.మీ. కు మించి పాఠశాల వాహనాలకు అనుమతి లేకున్నా 40 నుండి 50కి.మీ. నుండి విద్యార్థులను యథేచ్ఛగా తరలిస్తూ వారి వ్యాపారాభివృద్ధి చేసుకుంటున్నారు.

మరి బడ్జెట్ పాఠశాలలు లేవా…!

అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందుబాటులో ఉన్నా కూడా కేవలం సోషల్ స్టేటస్ కోసం కార్పొరేట్ పాఠశాలలకు పంపడం మన దౌర్బాగ్యం. ఒకవైపు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ, తక్కువ ఫీజుతో కార్పొరేటు కన్నా నాణ్యమైన విద్యను అందిస్తూ, విద్యతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న పాఠశాలను చిన్న చూపు చూడటం విద్యా వ్యవస్థకు గొడ్డలి పెట్టుగా మారింది. విద్యా వ్యవస్థకు ప్రయివేటు మరియు ప్రభుత్వ పాఠశాలలు రెండు కళ్లుగా ఉండగా కార్పొరేటు భూతం వచ్చి ప్రయివేటు మరియు ప్రభుత్వ పాటశాలలను కబళించివేస్తుంది.

మరి ఏం చేయాలి !

✅ మార్కులు / గ్రేడుల పట్ల విద్యార్థులు మరియు తల్లిదండ్రులలో ఉన్న అపోహలను తొలగించాలి.

✅ ఒక పేరుతో ఒకే పాఠశాలకు మాత్రమే అనుమతినివ్వాలి. గొలుసు కట్టు పాఠశాలలు అనగా ఒకే పేరుతో శాఖలు తెరవడాన్ని నిరోధించాలి.

✅ 10వ తరగతిలోపు పిల్లలు 20కి.మీ. మించి ప్రయాణం చేయకుండా చర్యలు చేపట్టాలి.

✅ మాస్ కాపీయింగ్ పట్ల కఠినంగా వ్యవహరించాలి. మాస్ కాపీయింగ్ పూర్తిగా నిరోదిస్తేనే నాణ్యమైన ఫలితాలు సాధించగలం. ప్రతిభ కలిగిన విద్యార్థులకు న్యాయం కూడా చేకూరుతుంది.

✅ ఎవరూ సంపూర్ణ జ్జ్ఞానులు కారు, వందకు వంద మార్కులు రావడం చాలా కష్టమైన పని. మార్కులు ఎక్కువ వేసి విద్యార్థులను ప్రోత్సహించడం వరకు పర్వాలేదు కానీ 100 శాతం మార్కులను ఇవ్వడం వలన విద్యార్థికి తానింకా చదవడానికి ఏమి లేదు అనే అపోహ మొదలవుతుంది.

✅ పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే వరకు కేవలం విద్యార్థి ఉత్తీర్ణుడు అయ్యాడా లేదా అని మాత్రమే వెల్లడించాలి. ఒకవేళ ఫెయిల్ అయితే ఆ సబ్జెక్టుల పేరు ప్రకటిస్తే సప్లిమెంటరీ పరీక్ష రాస్తారు. తద్వారా కార్పొరేటు కళాశాల అడ్డగోలు ప్రచారాలకు తెరపడుతుంది.

✅ పాఠశాలలో విద్యతోపాటు క్రీడలు, సామాజిక అంశాలపట్ల అవగాహన, నైతిక విలువలు మరియు దేశ భక్తి పెంపొందిచే విధంగా చర్యలు తీసుకోవాలి.

✅ విద్య హక్కు చట్టం ప్రకారం 25%పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

✅ పదవ తరగతిలోపు ఫౌండషన్ కోర్సులు (IIT, GATE etc …) లేకుండా కార్పొరేటు పాఠశాలను నియంత్రించాలి.

✅ ప్రభుత్వ మరియు ప్రయివేటు పాఠశాలలు ఎటువంటి కాంపైనింగ్ / బడిబాట లాంటి కార్యక్రమాలు చేయకూడదు. విద్య వ్యాపారం కాదు కాబట్టి ప్రకటనలు లేకుండా కేవలం పాఠశాలల ప్రతిభ ఆధారంగా పిల్లలను చేర్పించే స్వేచ్ఛ తల్లిదండ్రులకు కల్పించాలి.

✅ జనరల్ హాలిడేస్ మరియు సమ్మర్ హాలిడేస్ తప్పక పాఠశాలలు సెలవులు ఇచ్చి, పిల్లలకు మానసిక ప్రశాంతత కలిగించేలా చూసే భాద్యత కూడా విద్యా శాఖ తీసుకోవాలి.

✅ విద్యాభివృద్ధి ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు తీసుకుని పని చేస్తే అతి త్వరలో అన్ని సామాజిక రుగ్మతలు రూపుమాపబడుతాయన్నది నిర్వివాదాంశం.

Related posts