telugu navyamedia
ఆరోగ్యం

కరోనా ఎఫెక్ట్‌.. పిల్లల్లో పెరిగిన ఊబకాయం

ప్రపంచంలో క‌రోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. క‌రోనా కార‌ణంగా పిల్ల‌లు ఇంటికే ప‌రిమితం అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు తెరిచిన‌ప్ప‌టికి క‌రోనా భ‌యంతో పిల్ల‌ల‌ను ఇంటినుంచే చ‌దివించేందుకు తల్లిదండ్రులు ఆస‌క్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు బాగా బరువు పెరిగినట్టు ఓ సర్వేలో తేలింది. అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురించిన ఈ సర్వే మేరకు 5-11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు ఎక్కువగా ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు.

చిన్నారుల ఆరోగ్యంపై చేసిన ఈ అధ్యయనంలో దాదాపు రెండు లక్షల మంది ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డులను పరిశీలించగా, 2020-21లో అధికశాతం మంది పిల్లలు ఊబకాయానికి గురైనట్లు తెలిసింది. కొవిడ్‌ నేపథ్యానికి ముందు, ఆ తర్వాత పోలిస్తే అయిదు నుంచి పదకొండేళ్ల లోపు చిన్నారులు సగటున 2.25 కేజీల బరువు పెరిగారు. అలాగే 12-17 ఏళ్ల మధ్య పిల్లల బరువు రెండు కేజీలు అధికమైనట్లు తేలింది.

ఈ సమస్య 12ఏళ్లపైబడిన వారికన్నా, 11 ఏళ్లలోపు చిన్నారుల్లోనే ఎక్కువగా కనిపించింది. దీనికి పరిష్కారంగా పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు అలవరిచి, వ్యాయామం చేయించేలా తల్లిదండ్రులు కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే చిన్నప్పటి నుంచే ఊబకాయం సమస్యకు గురై పలు రకాల దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తున్నారు.

Related posts