telugu navyamedia
సినిమా వార్తలు

రాజశేఖర్ “కల్కి”ని చుట్టుముట్టిన కాపీ వివాదం

kalki movie first look

“యాంగ్రీ స్టార్” రాజశేఖర్ కథానాయకుడిగా శివాని శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై డైనమిక్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా ‘కల్కి’. ‘అ!’ చిత్రంతో విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 1980 నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ఇందులో రాజశేఖర్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ సరసన హీరోయిన్ గా అదా శర్మ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని కాపీ వివాదం చుట్టుముట్టింది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది.

ఈ నేపధ్యంలో కల్కి సినిమా కథ తనదే అంటూ మీడియాకు ఎక్కారు కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే రచయిత. ఆయన గతంలో రాజశేఖర్ తో “మహంకాళి” అనే సినిమా చేసారు. ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఆ సమయంలోనే తాను “కల్కి” టైటిల్ తో కథ చెప్పానని, స్క్రిప్ట్ కాపీ కూడా ఇచ్చానని, ఆ సమయంలో ఎక్కువ బడ్జెట్ అవుతుందని, ఇప్పుడు చేయలేమని, దాంతో తాను కూడా ఆ మ్యాటర్ వదిలేసి, తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నానని అన్నారు. అయితే ఇప్పుడు అదే కథను చిన్న చిన్న మార్పులు చేసి సినిమాగా తీసేసారని తనకు తెలిసిందని కార్తికేయ అంటున్నారు.

ఇక ఈ విషయమై తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసానని, తన కథ అసోసియేషన్ లో 2009లో రిజిస్టర్ అయిందని,ఆధారాలతో సహా ఉందని అన్నారు. అసోసియేషన్ చెందిన కమిటి “కల్కి” యూనిట్ ను చర్చలకు పిలిచిందని, ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సి కళ్యాణ్ కూడా పట్టించుకోవడం లేదని, తాము ఓ వెబ్ సైట్ లో కథ కొన్నామని కల్కి యూనిట్ చెప్తూ లింక్ పంపారని, కానీ ఆ లింక్ క్లిక్ చేస్తే, అక్కడ ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో ఇలాంటి వివాదాలు ఎక్కువైపోయాయి. సరిగ్గా సినిమా విడుదలకు ముందే ఇలాంటి వివాదాలు వెలుగు చూడడం గమనార్హం.

Related posts