telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మ్యాగీలో ప్రాణాంతక సీసం… అంగీకరించిన నెస్లే

Maggi

రెండు నిమిషాల్లో రెడీ అయ్యే మ్యాగీ అంటే పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టం. అయితే ఈ మ్యాగీలో ప్రాణాంతక సీసం ఉన్నట్టుగా… మ్యాగీ తయారీ సంస్థ నెస్లే ఇండియా సుప్రీం కోర్టులో అంగీకరించింది. అయితే గతంలోనే కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ (సీఎఫ్‌టీఆర్ఐ) మ్యాగీ నూడుల్స్‌లో అత్యంత ప్రమాదకరమైన సీసం అవశేషాలు ఉన్నట్టు తేల్చేసింది. ఇలా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నందుకుగానూ నెస్లే ఇండియాకు రూ.640 కోట్ల జరిమానా విధించాలంటూ 2015లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ… జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ)లో కేసు వేసింది. దీంతో కేసు విచారణపై స్టే విధించిన సుప్రీంకోర్టు నూడుల్స్‌ను పరీక్షించాలంటూ సీఎఫ్‌టీఆర్‌ఐని ఆదేశించింది.

అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో నూడుల్స్‌ను పరీక్షించిన సీఎఫ్‌టీర్‌ఐ అందులో ప్రాణాంతక సీసం ఉన్నమాట నిజమేనని స్పష్టం చేసింది. తాజాగా ఈ కేసు విచారణకు సంబంధించిన వాదనలు మొదలుకాగానే సీసం ఉన్న నూడుల్స్‌ను ఎందుకు తినాలంటూ నెస్లే తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని కోర్టు ప్రశ్నించింది. దీనిపై సింఘ్వి స్పందిస్తూ… ప్రభుత్వం చెబుతున్నట్టు నూడుల్స్‌లో సీసం ఉందనీ, కానీ అది అనుమతించిన మోతాదులోనే ఉందని, అంతేకాకుండా అది ప్రాణాంతక మోనోసోడియం గ్లుటమేట్ (ఎంఎస్‌జీ) కాదని కోర్టుకు సమాధానం చెప్పారు. దీంతో ఎన్‌సీడీఆర్‌సీలో కేంద్రం వేసిన కేసును విచారించేందుకు జస్టిస్ డీవీ చంద్రచూడ్, హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం అనుమతించింది. చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తినే ఈ మ్యాగీని బ్యాన్ చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని పలువురు కోర్టును కోరుతున్నారు.

Related posts