telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న కుటుంబాలకు కూడా దళితబంధు: కేసీఆర్‌

హుజురాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ప్రారంభమైంది. గతంలో శాలపల్లిలో ప్రారంభించిన రైతుబంధు అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న దళితబంధును కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ సింహగర్జన కరీంనగర్‌లోనే జరిగిందని గుర్తు చేశారు. మరో అద్భుతమైన కార్యక్రమానికి కరీంనగర్‌లోనే శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. తెలంగాణ సాకారమైనట్లే ఎస్సీల అభివృద్ధి కూడా జరిగి తీరాలన్నారు. శాలపల్లిలో దళితబంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. దళితబంధు పథకంతో మరో నాలుగేళ్లలో అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. ఏడాది క్రితమే ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకున్నానని, కానీ, కరోనా కారణంగా ఏడాది ఆలస్యమైందని కేసీఆర్‌ అన్నారు.

”మిషన్‌ భగీరథ పథకాన్ని చూసి మిగతా రాష్ట్రాలు నేర్చుకుంటున్నాయి. ఈ పథకం ద్వారా చిత్తశుద్ధి ఉంటే ఎంతటి లక్ష్యమైనా సాధించవచ్చని నిరూపించాం. ఇతర పార్టీలకు రాజకీయం అనేది ఒక క్రీడ. పేదలకు రూపాయి ఇవ్వని పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయి. దళితబంధును విజయవంతం చేసే బాధ్యత ఎస్సీ విద్యార్థులపై ఉంది. నూటికి నూరు శాతం దళితబంధును అమలు చేస్తాం.” అని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 21వేల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. నియోజకవర్గంలోని ప్రతి ఎస్సీ కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తాం. 25 ఏళ్ల క్రితం నుంచే ఎస్సీల కోసం నా మస్తిష్కంలో ఎన్నో పథకాలు ఉన్నాయి. కాంగ్రెస్‌, భాజపా ప్రధానులు ఇలాంటి పథకాన్ని ఎందుకు అమలు చేయలేదు. ఇప్పటి వరకు ఆలోచన చేయని నేతలు ఇవాళ విమర్శలు చేస్తున్నారు” అని కేసీఆర్‌ మండిపడ్డారు.

రాష్ట్రంలో 17 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని సీఎం కేసీఆర్‌ ఆన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న కుటుంబాలకు కూడా దళితబంధు వర్తింపజేస్తామని చెప్పారు.” రైతుబంధు తరహాలోనే దళితబంధు అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు చివరి వరుసలో దళితబంధు ఇస్తాం. ఎస్సీలలో నిరుపేదలకు ముందుగా దళితబంధులు నిధులు ఇస్తాం. అతి తక్కువ ఉపాధి, ఆదాయం ఉన్నవారు ఎస్సీలు. వారి పట్ల వివక్ష ఇంకా ఎన్ని దశాబ్దాలు కొనసాగుతుంది. హుజూరాబాద్‌ ప్రజలు దేశానికే ఆదర్శంగా నిలవాలి. 15 రోజుల్లో ఈ పథకం కోసం మరో రూ.2 వేల కోట్లు మంజూరు చేస్తున్నా” అని కేసీఆర్‌ వెల్లడించారు. దళితబంధు నిధులతో నచ్చిన పని చేసుకోవచ్చని సీఎం కేసీఆర్‌ అన్నారు. నచ్చిన స్వయం ఉపాధి పనులు, వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. ”దళితబంధు డబ్బు 100 శాతం సబ్సిడీతో ఇస్తాం. రూ.10లక్షలతో వచ్చే ఏడాదికల్లా రూ.20 లక్షలు సంపాదించుకోవాలి. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు రిజర్వేషన్‌ కల్పిస్తాం. లైసెన్సింగ్‌ దుకాణాల్లో దళితులకు రిజర్వేషన్లు ఇస్తాం. ఎరువుల దుకాణాలు, మందుల దుకాణాల్లో రిజర్వేషన్లు ఇస్తాం. ధనిక పారిశ్రామికవేత్తల వలె ఎస్సీలు కూడా వ్యాపారంలో రాణించాలి. దళిత బంధు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మిగిలిన రాష్ట్రాల్లోనూ దళిత బంధుపై చర్చ జరుగుతుంది. ప్రపంచంలోనే ఇదో మహోన్నత ఉద్యమం అవుతుంది.” అని కేసీఆర్‌ అన్నారు.

Related posts