telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రత్యేక హోదా మాత్రమే ఏపీకి జీవనరేఖ: సీఎం జగన్

jagan

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. ప్రత్యేక హోదా అవసరాన్ని, రెవెన్యూ లోటు భర్తీ పై నివేదిక సమర్పించారు. గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి లక్ష 18 వేల కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు ఉందని, అదే సమయంలో ఏపీ రెవెన్యూ లోటు రూ.66,362 కోట్లు అని తెలిపారు. రాష్ట్ర విభజన నాటికి ఏపీకి రూ.97 వేల కోట్ల అప్పులు ఉన్నాయని సీఎం జగన్ వెల్లడించారు.

2018-19 నాటికి ఏపీ అప్పులు రూ.2 లక్షల 58 వేల కోట్లకు చేరాయని అన్నారు. ఏడాదికి రూ. 20 వేల కోట్ల వడ్డీ, రూ.20 వేల కోట్ల అసలు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా మాత్రమే ఏపీకి జీవనరేఖ అని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని ఇకనైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, హోదా వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు సమకూరతాయని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ నిలదొక్కుకోవాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి అని జగన్ ఉద్ఘాటించారు.

Related posts