telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్, కేటీఆర్ స్వతంత్ర రాజులుగా వ్యవహరిస్తున్నారు: భట్టివిక్రమార్క

CLP Batti vikramarka fire KCR KTR

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై మండిపడ్డారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ స్వతంత్ర రాజుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం ఎప్పుడో మానేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వాదులు చూస్తూ ఊరుకుంటే ప్రమాదం అని హెచ్చరించారు. బరితెగించి మరీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇతర పార్టీలను లేకుండా చేయడానికి కేసీఆర్, కేటీఆర్ కలిసి ఆడే వింతనాటకం నీచంగా ఉందంటూ విమర్శించారు. నలుగురైదుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నంత మాత్రాన కాంగ్రెస్ లేకుండా పోతుంది అనుకోవడం పొరపాటని, పార్టీ ఇన్ చార్జ్ వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలో మార్చి 18న గవర్నర్ ను కలుస్తామని తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ తో చర్చిస్తామని తెలిపారు. అవసరమైతే తెలంగాణలో రాష్ట్రపతిపాలన పెట్టాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేస్తామని వెల్లడించారు. దశలవారీగా ఈ ప్రభుత్వం మీద ఉద్యమం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులపై జాతీయ పార్టీ నాయకులను కలుస్తామని భట్టివిక్రమార్క పేర్కొన్నారు.

Related posts