telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పారిశుద్ధ్య కార్యక్రమాలు.. ప్రైవేట్ పరం ..

telangana map

రాష్ట్రంలో ఉన్న వివిధ పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛతను సాకారం చేసేందుకు జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. రోజంతా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించడమే లక్ష్యంగా రంగం సిద్ధం చేస్తోంది. పాతబస్తీలోని చారిత్రక కట్టడాల వద్ద చేపట్టిన ప్రయోగాత్మక ప్రాజెక్టు సఫలం కావడంతో.. అదే విధానాన్ని నగర వ్యాప్తంగా 27 ప్రాంతాల్లో అమలు చేయాలని నిర్ణయించింది. టెండరు నిబంధనలు రూపుదిద్దుకుంటున్నాయి. ఏడాదిపాటు కాంట్రాక్టు ఇచ్చే టెండరు నోటిఫికేషన్‌ రెండు రోజుల్లో విడుదల కానుంది. మున్ముందు రోడ్లను ఊడ్చే కార్యక్రమం ప్రైవేటుపరం కాబోతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నగరంలో నిత్యం 18వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. పర్యాటక, రద్దీ ప్రాంతాల్లో 24గంటలు పారిశుద్ధ్య కార్యక్రమాలు జరగాలని గతంలో మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది.

బల్దియా పాలకమండలి ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా రెండు ఏజెన్సీలు నగరంలోని పలు చారిత్రక కట్టడాలు, ప్రముఖ కేంద్రాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాయి. ఇక్జోర సంస్థ పాతబస్తీలోని చార్మినార్‌, మక్కామసీదు, చౌమహళ్లా ప్యాలెస్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, హైకోర్టు కేంద్రంగా స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టింది. నెలన్నరగా పని చేస్తోంది. చిరు వ్యాపారులకు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తోంది. దాంతో చార్మినార్‌ నీడలో పర్యాటకులు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి సాకారమైందని అధికారులు చెబుతున్నారు. పర్యాటక కేంద్రం చుట్టూ మూడు కి.మీ.మేర రోడ్లపై చెత్త లేకుండా చూడటం ఏజెన్సీల బాధ్యత అని, అందులో భాగంగా రెండు నెలలు చేపట్టిన ప్రయోగాత్మక ప్రాజెక్టుకు రూ.29లక్షలు చెల్లించాల్సి ఉందని బల్దియా పేర్కొంది. ఇందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న తీర్మానాన్ని స్థాయి సంఘం ఆమోదించింది. సర్కారు పచ్చజెండా ఊపితే 27 కేంద్రాలకు టెండర్లు పిలుస్తామంది.

ఇటీవల జీహెచ్‌ఎంసీ నగర వ్యాప్తంగా 709కి.మీ రోడ్ల నిర్వహణను ఐదేళ్లపాటు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించింది. రోడ్లపై గుంతలు పూడ్చడం, కొత్త రోడ్లు వేయడంతో పాటు ఆయా మార్గాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టడం కూడా నిర్వహణలో భాగమే. అదే తరహాలో క్రమంగా ఇతర ప్రాంతాల్లోని రహదారులను శుభ్రం చేసే పనులనూ అధికారులు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తోన్న 18వేల మంది కార్మికుల ఉపాధికి ఢోకా ఉండదని అధికారులు చెబుతున్నా.. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయోనని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో ఏడు తీర్మానాలు ఆమోదం పొందాయి. ఆ మేరకు విపత్తుల స్పందన దళం(డీఆర్‌ఎఫ్‌) పనితీరును మెరుగుపరిచేందుకు 100మంది మాజీ సైనికుల సేవలను పొరుగు సేవల కింద నెలకు రూ.21వేల జీతంతో ఉపయోగించుకోవాలన్న నిర్ణయం జరిగింది. ఆర్మీ వెల్ఫేర్‌ ప్లేస్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. బల్దియా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డీఆర్‌ఎఫ్‌ విభాగాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లకు డిప్యూటేషన్‌ అలవెన్సు మంజూరుచేయడంతో పాటు ఇతర ప్రతిపాదనలు ఉన్నాయి.

Related posts