telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జేడీయూలో చీలిక … పౌరసత్వ చట్టంపై భిన్నాభిప్రాయాలు..త్వరలో కొత్తకుంపటి..

clashes on nitish and pk with nrc bill

పౌరసత్వ సవరణ బిల్లు కు బిహార్ సీఎం నితీశ్ కుమార్ బాహాటంగానే మద్దతు ప్రకటించారు. దీంతో జేడీయూలో చీలిక వచ్చినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. జేడీయూ కీలక నేత, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏకంగా రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. పైకి వివిధ బాధ్యతల రీత్యా రాజీనామా చేస్తున్నానని ప్రకటించినా, పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూనే రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. అయితే నితీశ్ వారించినట్లు సమాచారం. మరో సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి పవన్ వర్మ కూడా నితీశ్ మద్దతుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయంపై నేరుగా నితీశ్‌తో తాడోపేడో తేల్చుకుందామని నిర్ణయానికివోచ్చినట్టు సమాచారం. జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను కలిసే కొద్ది సేపటి ముందు ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్ పీకేపై తీవ్రంగా మండిపడ్డారు. తమ నేత నితీశ్ కుమార్ పౌరసత్వ సవరణ చట్టానికి సుముఖంగా ఉన్నారని, మద్దతిచ్చారని, దానిని పీకే వ్యతిరేకించడం ఖండించాల్సిన అంశమని తెలిపారు. ఒకవేళ ఆయనకు నచ్చకపోతే పార్టీ విడిచి వెళ్లిపోవచ్చని మండిపడ్డారు. సీఎం నితీశ్‌ను కలిసే కొద్ది గంటల ముందు కూడా ప్రశాంత్ కిశోర్ ఈ బిల్లును వ్యతిరేకించారు.

నితీశ్ కుమార్‌తో భేటీ అయిన తర్వాత ప్రశాంత్ కిశోర్ పూర్తిగా మెత్తబడ్డారు. వీరిద్దరి మధ్యా దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘ భేటీ జరిగింది. ఈ భేటీలోనే పౌరసత్వ సవరణ చట్టంపై నితీశ్ తన వైఖరిని పీకేతో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని సమాచారం. అంతేకాకుండా దీనిపై విభేదించడంపై కూడా నితీశ్ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఓ వర్గం నేతలు అంటున్నారు. బిహార్‌లో ఎన్నార్సీని అమలు చేయమని ప్రశాంత్ కిశోర్‌కు సీఎం నితీశ్ హామీ ఇచ్చినట్లు కొందరు నేతలు చెప్పుకుంటున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ…. పౌరసత్వ సవరణ చట్టం ఓకే గానీ, ఎన్నార్సీ అమలు మాత్రం చాలా ప్రమాదమని ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీని కలిపి అమలు చేయడం మాత్రం చాలా ప్రమాదకరమని ప్రకటించారు. కొన్ని రోజులుగా సీఎం నితీశ్‌కు, ప్రశాంత్ కిశోర్‌కు ఏమాత్రం పొసగడం లేదని పుకార్లు వస్తున్నాయి. అయితే దీనిపై నేటి సమావేశంలో పీకే ఓ స్పష్టతనిచ్చినట్లు సమాచారం. పార్టీ బాధ్యతల నుంచి తనను తప్పించాలని పీకే కొన్ని రోజులుగా నితీశ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, తాజాగా ఆమ్‌ఆద్మీ పార్టీ సలహాదారుగా కూడా ఉండబోతున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి రావడానికి వ్యూహకర్తగా కూడా వ్యవహరించారు.

ఒక పార్టీ నేతగా ఉంటూ, ఇతర పార్టీలను అధికారంలోకి తీసుకురావడానికి వ్యూహకర్తగా ఉండటం సమంజసం కాదని, రాజీనామాను ఆమోదించాలని పీకే జేడీయూ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు ఐ- పాక్ అనే సంస్థ తనది కాదని, కొందరు యువకులు దానిని నడిపిస్తున్నారని, తాను కేవలం సలహాలు మాత్రమే ఇస్తున్నానని పీకే స్పష్టం చేశారు. మరో కీలక నేత, జేడీయూ ప్రధాన కార్యదర్శి పవన్ వర్మ కూడా నితీశ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి నితీశ్ మద్దతుపై నేరుగా ఆయననే వివరణ కోరుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా, ఐక్యతకు, సామరస్యానికి విఘాతం కలిగించే సూత్రాల నుంచి ఎందుకు పక్కకు తప్పుకున్నారని, ఈ విషయంపై నితీశ్ కుమార్ వెంటనే స్పందించాలని పవన్ వర్మ డిమాండ్ చేశారు. దీనితో పార్టీలో చీలిక వచ్చిందని కొందరు భావిస్తున్నారు.

Related posts