telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలుగు భాష కోసం ఉద్యమం చేయాల్సిన దుస్థితి ఏర్ప‌డింది – జస్టిస్‌ ఎన్వీ రమణ

తెలుగు ప్రజల్లో నేను ఒకడినైనందుకు గర్విస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన మీట్‌ అంట్‌ గ్రీట్‌ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..మా తెలుగు తల్లికి మల్లెపూల దండతో కార్యక్రమం ప్రారంభమైందని సీజేఐ అన్నారు. తెలుగుతల్లి ముద్దు బిడ్డలుగా ఉన్న మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. తెలుగు అనేది కేవలం భాష కాదు.. జీవన విధానం, నాగరికత అని అన్నారు

ఎన్నో దశల్లో అనేక పరీక్షలు ఎదుర్కొని ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. మాతృభూమిని సొంత మనుషులను వదులుకొని ఇక్కడ ఉంటున్నారని పేర్కొన్నారు. ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తూ జీవితాన్ని గడుపుతున్నారని కొనియాడారు.

మీ నిబద్ధత చూస్తుంటే తెలుగుజాతి భవిష్యత్తు సురక్షితమని విశ్వసిస్తున్నానని చెప్పారు. పుట్టిన ఊరు, మట్టి వాసన గుబాళింపును నెమరువేసుకోవాలని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు.

మాతృభాషను, మాతృమూర్తిని పూజించడం ఒక ప్రత్యేకత అని చెప్పారు. అమ్మ భాషలోని తియ్యదనం అనుభవించాల్సిందే.. మాటాల్లోనే చెప్పలేమన్నారు.

రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను సీజేఐ స్థాయికి ఎదిగానని జస్టిస్‌ ఎన్వీ రమణ చెప్పారు.తెలుగువాడిగా సీజేఐ అవకాశం రావడం చాలా సంతోషాన్నిచ్చిం దని చెప్పారు.

అయితే న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకోవడం చాలా కష్టమన్నారు. పట్టుదలతో పాటు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉన్నందునే ఈ స్థాయికి చేరుకున్నానని వెల్లడించారు.

ఇంట్లో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మాతృభాషలోనే మాట్లాడాలన్న సీజేఐ.. మన భాష, సంస్కృతి మరచిపోతే జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. తెలుగు భాష కోసం ఉద్యమం చేయాల్సిన దుస్థితి ఏర్పడడం బాధగా ఉందన్నారు.

మాతృభాషలో చదివితే ఉద్యోగాలు రావనేది అపోహ మాత్రమేనని జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. తాను లా మాత్రమే ఇంగ్లిష్‌ మీడియంలో చదివానని చెప్పారు. మాతృభాషలోనే చదివి నేను ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు.

Related posts