telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్… విద్యారంగంలోకి మెగాస్టార్

chiranjeevi on maa schemes

వెండితెరపై మెగాస్టార్‌గా వెలుగొందుతున్న కొణిదెల చిరంజీవి ఇప్పటి వరకు వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఇప్పుడు విద్యావేత్తగా మారబోతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మెగా ఫ్యామిలీ చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇందుకు శ్రీకారం చుడుతోంది. అధునాతన సౌకర్యాలు, ఏసీ వసతులతో క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తున్నామని చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ సీఈఓ జే శ్రీనివాసరావు ప్రకటించారు. విద్యార్థులకు హైటెక్ శిక్షణ ఇచ్చేందుకు ప్రప్రథమంగా శ్రీకాకుళం నగర శివార్లలోని పెద్దపాడు రోడ్డులో మొదటి చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ ను అన్ని సదుపాయాలతో నెలకొల్పుతున్నట్టు చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. నర్సరీ నుంచి గ్రేడ్ 5 వరకు ఐజిసిఎస్ఈ, సీబీఎస్ఈలలో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏసీ క్లాస్ రూమ్ లు, ఆడియో విజువల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్, సీసీటీవీల ద్వారా పర్యవేక్షణ, పేరెంట్-టీచర్ ముఖాముఖి, ఇంగ్లిష్ గ్రామర్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలని వివరించారు.

అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా తరగతులను నిర్వహించనున్నట్టు చెప్పారు. వర్తమాన పోటీ ప్రపంచంలో చిన్నతనం నుంచే విద్యార్థులకు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే సాంకేతిక అంశాలతో పాటు తార్కిక ఆలోచన, విశ్లేషణా సామర్థ్యం, నైపుణ్యాలలో శిక్షణ, సమస్యల పరిష్కారం, కంప్యూటర్స్ లోని ప్రాథమిక, ఆధునిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించే విధంగా స్టూడెంట్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఎస్టీఈపీ) ద్వారా అత్యాధునిక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ స్కూల్స్ కి మెగాస్టార్ చిరంజీవి గౌరవ వ్యవస్థాపకులుగా, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గౌరవ అధ్యక్షుడిగా, నాగబాబు గౌరవ చైర్మన్ గా ఉంటారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు గౌరవ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఈ స్కూల్ లో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల పిల్లలకి ప్రత్యేక ఫీజు రాయితీలు ఉంటాయని సీఈవో జె శ్రీనివాసరావు తెలిపారు. చిరంజీవి అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Related posts