telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శబరిమల ఆలయ ప్రవేశంపై యేసుదాస్ కామెంట్స్… చిన్మయి కౌంటర్

Chinmayi

ప్రముఖ సింగర్ చిన్మయి మరోసారి శబరిమల ఇష్యూపై స్పందిస్తూ ప్రముఖ గాయకుడు యేసుదాస్‌కు కౌంటర్ ఇచ్చింది. శబరిమలలో మహిళల ప్రవేశంపై చర్చోపచర్చలతో పాటు అనేక వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో ప్రముఖ గాయకుడు, అయ్యప్ప పాటలకు పేరుగాంచిన యేసుదాస్ స్పందిస్తూ కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. శబరిమలలోనే కాకుండా అన్ని అయ్యప్ప దేవాలయాల్లో అయ్యప్పను స్మరిస్తూ యేసుదాస్ పాడే కీర్తనలు, పాటలు ఎంత ఫేమస్ అన్నది అందరికీ తెలిసిందే. యేసుదాసు అయ్యప్ప ఆలాపన లేనిదే చాలా చోట్ల పూజలు జరుగవు అంటే అతిశయోక్తి కాదు. హరివరాసాణం అంటూ యేసుదాస్ పాడే పాట వింటే ఎవరైనా అయ్యప్ప భక్తి పారవశ్యంలో మునిగిపోవాల్సిందే. ఎన్నో అయ్యప్ప పాటలు పాడి ఆయనకు స్వయానా భక్తుడైన యేసుదాస్‌.. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై స్పందించారు. “మహిళలు వెళ్లాలనుకుంటే చాలా దేవాలయాలు ఉన్నాయి. అందమైన అమ్మాయిలు నేటి ఆదునిక వస్త్రాధారణతో శబరిమలకు వెళితే అయ్యప్ప కళ్లు తెరిచి చూడడు కానీ.. భక్తుల దృష్టి వీరిపైకి మరలొచ్చు. అందుకే వారిని అక్కడికి రావొద్దని అంటున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. ఆధునిక పోకడలతో అన్నీ మారిపోయాయి. దేవాలయాల్లోకి వచ్చే వాళ్లు చాలా నియమాలతో ఉండేవారు. కనీసం భార్యనైనా కన్నెత్తి చూసే ఆలోచన ఉండేకాదు. కాని ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. దయచేసి అయ్యప్ప భక్తుల్ని టెంప్ట్ చేయొద్దనేది నా విన్నపం.. ఇదొక్కటే మిమ్మల్ని నేను కోరుకునేది” అంటూ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు యేసుదాస్.

అయితే స్త్రీల హక్కులు, వారి వస్త్రధారణ తదితర అంశాలపై ఏ మూల ఏం జరిగినా తన సోషల్ మీడియా ఖాతాలకు పనిచెప్పి గళం విప్పే సింగర్ చిన్మయి, యేసుదాస్ వ్యాఖ్యలకు సెటారికల్ కౌంటర్ ఇచ్చింది. “డియర్ అయ్యప్ప.. మీ భక్తుల నుంచి నన్ను కాపాడండి” అంటూ యేసుదాస్ కామెంట్స్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది చిన్మయి.

Related posts