telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తిరుపతి : … చైనా సంస్థ టీసీఎల్ …నిర్మాణ పనులు భూమిపూజ చేసిన రోజా ..

china company TCL started construction in

చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో గత ప్రభుత్వ హయాంలో చైనా పారిశ్రామిక దిగ్గజం టీసీఎల్ భారీ కంపెనీని ఏర్పాటు కు ముందుకు వచ్చింది. తాజాగా ఈ సంస్థ నిర్మాణ పనులను ప్రారంభించింది. ఈ పనులకు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా భూమిపూజ చేశారు. తిరుపతి-శ్రీకాళహస్తి మార్గంలోని ఏర్పేడు మండలం వికృతమాల వద్ద ఈ కంపెనీ నిర్మితం కానుంది. ఈ సంస్థ ప్రారంభ పెట్టుబడి 2,200 కోట్ల రూపాయలు. దీనివల్ల 6,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. పరోక్షంగా మరో 4000 మందికి ఉపాధి అవకాశాలు లభించడానికి అవకాశాలు ఉన్నాయని ఏపీఐఐసీ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీఐఐసీ ఈ సంస్థకు భూమిని కేటాయించింది. ఈ సంస్థకు కేటాయించిన మొత్తం భూములు 139 ఎకరాలు. గత ఏడాది డిసెంబర్ లో ఈ సంస్థకు చంద్రబాబు భూమిపూజ చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఈ సంస్థలో ఉత్పత్తి ఆరంభమౌతుందని తెలుస్తోంది. భూమిపూజ కార్యక్రమంలో టీసీఎల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అబెల్ ఝియాంగ్ పాల్గొన్నారు.

చైనాలో 1981లో ఏర్పాటైన ఈ సంస్థకు ప్రస్తుతం 160 దేశాల్లో ఉత్పాదక యూనిట్లు ఉన్నాయి. 80 వేల మందికి పైగా ఉద్యోగులు ఆయా యూనిట్లలో పనిచేస్తున్నారు. మొత్తంగా 22 పారిశ్రామిక యూనిట్లు, 28 పరిశోధనా కేంద్రాలను నెలకొల్పింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం అసెంబ్లీలోనూ ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం అమల్లోకి తీసుకొచ్చిన తరువాత రాష్ట్రంలో ఏర్పాటైన మొట్టమొదటి సంస్థ టీసీఎల్. ఇక ఈ సంస్థలో 75 శాతం మేర ఉద్యోగాలు స్థానికులకే దక్కడం ఖాయమైంది. టీసీఎల్ అంచనా ప్రకారం.. కనీసం 4,500 మంది స్థానిక యువతకు ఈ సంస్థలో ఉద్యోగాలు లభిస్తాయని ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు.

Related posts