telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ : చెన్నై .. వాట్సన్ చెలరేగి.. గెలిపించాడు..

చెన్నై 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ పై విజయం సాధించి, తనఖాతాలో మరో విజయాన్ని చేర్చుకుంది. మనీష్‌ పాండే (83 నాటౌట్‌; 49 బంతుల్లో 7×4, 3×6), డేవిడ్‌ వార్నర్‌ (57; 45 బంతుల్లో 3×4, 2×6) సత్తా చాటడంతో మొదట సన్‌రైజర్స్‌ 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగా.. షేన్‌ వాట్సన్‌ (96; 53 బంతుల్లో 9×4, 6×6) విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడటంతో విజయం సాధించింది. లక్ష్యాన్ని ఆ జట్టు 19.5 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి ఛేదించింది. వాట్సన్‌ ఔటయ్యాక చెన్నై కొంత ఇబ్బంది పడ్డా.. చివరికి విజయం ఆ జట్టునే వరించింది. ఈ విజయం గత ఐపీఎల్ ఫైనల్ ను గుర్తుకు తెచ్చింది. ఆ ఐపీఎల్ ఫైనల్ లో సన్‌రైజర్స్‌ 178 పరుగులు చేసింది. చక్కటి బౌలింగ్‌ ఉన్న సన్‌రైజర్స్‌ ఈ స్కోరును కాపాడుకుంటుందనే అనుకున్నారంతా. కానీ షేన్‌ వాట్సన్‌ మెరుపు శతకంతో చెన్నై ట్రోఫీ పట్టుకుపోయింది.

3 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 8/1 తో చెన్నై ఇన్నింగ్స్‌ ఆరంభమైన తీరు చూస్తే ఆ జట్టు గెలుస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. 2 ఓవర్లకు 2 పరుగులే చేసిన సీఎస్‌కే.. మూడో ఓవర్లో డుప్లెసిస్‌ (1) వికెట్‌ కోల్పోయింది. హుడా మెరుపు త్రోకు అతను రనౌటయ్యాడు. ఐతే మొదట సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ తొలి వికెట్‌ తర్వాత పాండే, వార్నర్‌ ఎలా రెచ్చిపోయారో.. చెన్నై ఇన్నింగ్స్‌లోనూ అలాగే జరిగింది. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఐదో ఓవర్లో వాట్సన్‌ సిక్స్‌, ఫోర్‌ కొట్టి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. ఫామ్‌లో లేని రైనా.. సందీప్‌ శర్మ వేసిన ఆరో ఓవర్లో చెలరేగిపోయాడు. నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు బాదేశాడు. తర్వాత కూడా ఇద్దరూ ఇలాగే పోటీ పడి షాట్లు ఆడటంతో 8 ఓవర్లకు 68/1తో చెన్నై మంచి స్థితికి చేరుకుంది. ఈ దశలో హైదరాబాద్‌ బౌలర్లు పుంజుకున్నారు. 3 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చారు. రషీద్‌ పదో ఓవర్లో రైనా (38; 24 బంతుల్లో 6×4, 1×6) వికెట్‌ కూడా తీశాడు. రైనా వెనుదిరగడం, వాట్సన్‌ కొంచెం తడబడుతుండటంతో చివరి 9 ఓవర్లలో 91 పరుగుల ఛేదన చాలా కష్టంగానే అనిపించింది. కానీ వాట్సన్‌ మళ్లీ రెచ్చిపోయాడు. సందీప్‌ వేసిన 12వ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌ బాదిన అతను.. 14వ ఓవర్లో రషీద్‌కూ ఇదే శిక్ష వేశాడు. పరుగులు కట్టడి చేయడంలో నిష్ణాతుడైన రషీద్‌ తన తర్వాతి ఓవర్లోనూ వాట్సన్‌ ధాటికి బెంబేలెత్తిపోయాడు. దీంతో సమీకరణం 18 బంతుల్లో 16గా మారింది. ఈ దశలో సెంచరీకి 4 పరుగుల దూరంలో వాట్సన్‌ ఔటైపోయాడు. 18వ ఓవర్లో అతడి వికెట్‌ తీసిన భువి మూడే పరుగులిచ్చాడు. ఖలీల్‌ వేసిన తర్వాతి ఓవర్లో నాలుగే పరుగులొచ్చాయి. రాయుడు (21) వేగంగా ఆడలేకపోయాడు. 6 బంతుల్లో 9 చేయాల్సిన పరిస్థితి. ఐతే జాదవ్‌ (11 నాటౌట్‌) చివరి ఓవర్‌ రెండో బంతికి సిక్సర్‌ బాది చెన్నై పని తేలిక చేశాడు. మధ్యలో రాయుడు ఔటైనా.. ఐదో బంతికి సింగిల్‌ తీసిన జాదవ్‌ విజయాన్ని పూర్తి చేశాడు.

సన్‌రైజర్స్‌ స్కోరు 120/1. అప్పటికింకా 40 బంతులు మిగిలున్నాయి. ఇంకేముంది 200 పక్కా అనుకున్నారు సన్‌రైజర్స్‌ అభిమానులు. కానీ ఆ జట్టు 40 బంతుల్లో 55 పరుగులే చేయగలిగింది. ఈ సీజన్లో చివరి మ్యాచ్‌ ఆడుతున్న బెయిర్‌స్టో డకౌటై నిరాశ పరచగా 2 ఓవర్లకు సన్‌రైజర్స్‌ స్కోరు వికెట్‌ నష్టానికి 9 పరుగులే. స్వల్ప స్కోర్లకు పెట్టింది పేరైన చెపాక్‌ పిచ్‌పై ఈ ఆరంభం చూస్తే.. స్కోరు 120-130కి పరిమితం అవుతుందేమో అనిపించింది. కానీ మళ్లీ జట్టులోకి వచ్చిన పాండే తన శైలికి భిన్నంగా చెలరేగిపోవడం, ఫామ్‌ కొనసాగిస్తూ వార్నర్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. 10.5 ఓవర్లలోనే స్కోరు 100కు చేరుకుంది. 13.2 ఓవర్లలో 120/1తో తిరుగులేని స్థితిలో నిలిచింది. కానీ హర్భజన్‌.. వార్నర్‌ను కూడా ఔట్‌ చేసి చెన్నైకి బ్రేక్‌ ఇచ్చాడు. అక్కడి నుంచి పాండే జోరూ తగ్గింది. విజయ్‌ శంకర్‌ (26; 20 బంతుల్లో 2×4, 1×6) ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ చివరి 3 ఓవర్లలో సన్‌రైజర్స్‌ 24 పరుగులే చేసి, 175 స్కోరుతో సరిపెట్టుకుంది.

chennai won on hyderabad in ipl 2019 matchనేటి మ్యాచ్ : బెంగుళూరు vs పంజాబ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది.

Related posts