telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ : దిల్లీని.. ఘోరంగా ఓడించిన .. చెన్నై..

తాజా ఐపీఎల్ మ్యాచ్ లో దిల్లీ క్యాపిటల్స్‌ను, చెన్నై సూపర్‌కింగ్స్‌ 80 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. రైనా (59; 37 బంతుల్లో 8×4, 1×6), ధోని (44 నాటౌట్‌; 22 బంతుల్లో 4×4, 3×6) మెరవడంతో మొదట చెన్నై 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఛేదనలో చెన్నై బౌలర్ల స్పిన్‌ మాయాజాలానికి దిల్లీ తడబడింది. తాహిర్‌ (4/12), జడేజా (3/9), హర్భజన్‌ (1/28) ధాటికి 16.2 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. శ్రేయస్‌ అయ్యర్‌ (44; 31 బంతుల్లో 4×4, 1×6) టాప్‌ స్కోరర్‌. దిల్లీ, చెన్నై ఇప్పటికే ప్లేఆఫ్స్‌ చేరిన సంగతి తెలిసిందే.

దిల్లీ ఇన్నింగ్స్‌.. చెన్నై ఇన్నింగ్స్‌తో పోలిస్తే భిన్నంగా సాగింది. చెన్నై పేలవంగా ఆరంభించి ఘనంగా పూరించారు. దిల్లీ మెరుగ్గా ఆరంభించి అత్యంత పేలవంగా ముగించింది. పృథ్వీ షా (4) తొలి ఓవర్లోనే ఔటైనా.. దిల్లీకి మంచి ఆరంభమే దక్కింది. ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ మెరవడంతో 5 ఓవర్లలో 49/1తో నిలిచింది. కానీ ఆరో ఓవర్లో ధావన్‌ (19)ను హర్భజన్‌ బౌల్డ్‌ చేశాక.. దిల్లీ ఛేదన స్వరూపమే మారిపోయింది. జడేజా, తాహిర్‌ మాయకు ఉక్కిరిబిక్కిరి అయిన ఆ జట్టు వేగంగా వికెట్లు కోల్పోయింది. మిగతా బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఏడో ఓవర్లో ప్రమాదకర పంత్‌ (5)ను తాహిర్‌ ఔట్‌ చేయగా.. ఆ వెంటనే ఇంగ్రామ్‌ (1)ను జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. పదో ఓవర్లో తాహిర్‌.. అక్షర్‌ పటేల్‌ (9), రూథర్డ్‌ఫర్డ్‌ (2)లను ఔట్‌ చేయగా.. తర్వాతి ఓవర్లో మోరిస్‌ (0), శ్రేయస్‌లను జడేజా వెనక్కి పంపాడు. ధోని చురుకైన స్టంపింగ్‌తో ఈ ఇద్దరూ వెనుదిరిగారు. దిల్లీ 12 ఓవర్లలో 85/8తో నిలిచింది. ఆ తర్వాత ఆ జట్టు పరాజయం లాంఛనమే. ఇద్దరు దిల్లీ బ్యాట్స్‌మెన్‌ మాత్రమే రెండంకెల స్కోరు చేయడం గమనార్హం.

ఆరంభం చూస్తే చెన్నై కనీసం 150 వరకైౖనా వెళ్లేలా కనిపించలేదు. అంత పేలవంగా మొదలైంది ఆ జట్టు ఇన్నింగ్స్‌. కానీ రైనా చక్కని బ్యాటింగ్‌తో పరిస్థితిని చక్కదిద్దితే.. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ ధోని చెన్నైకి కళ్లు చెదిరే ముగింపునిచ్చాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. సుచిత్‌, బౌల్ట్‌ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నాలుగు ఓవర్లలో కేవలం 7 పరుగులే చేసి ఓపెనర్‌ వాట్సన్‌ (0) వికెట్‌ను చేజార్చుకుంది. డుప్లెసిస్‌ (39; 41 బంతుల్లో 2×4, 2×6) ధాటిగా ఆడలేకపోయాడు. పరుగుల కోసం చెమటోడ్చాడు. రైనా చకచకా కొన్ని బౌండరీలు బాదడంతో పరిస్థితి కాస్త మెరుగైంది. అయినా 10 ఓవర్లలో స్కోరు 53/1 మాత్రమే. డుప్లెసిస్‌ వేగాన్ని అందుకోవడంతో స్కోరు వేగం పెరిగింది. అతడు రూథర్డ్‌ఫర్డ్‌, అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌ల్లో ఒక్కో సిక్స్‌ కొట్టాడు. ఐతే అక్షర్‌ బౌలింగ్‌లో వరుసగా రెండో సిక్స్‌ కొట్టబోయి డుప్లెసిస్‌ నిష్క్రమించాడు. 14వ ఓవర్లో అతడు ఔటయ్యేటప్పటికి స్కోరు 87. ఐతే రైనా రెచ్చిపోయి ఆడాడు. సుచిత్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6 బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ అదే ఓవర్లో అతడు వెనుదిరిగాడు. ఐతే జడేజా (25; 10 బంతుల్లో 2×4, 2×6) వేగం తగ్గనివ్వలేదు. అక్షర్‌ బౌలింగ్‌లో వరుసగా 6, 4.. మోరిస్‌ ఓవర్లో ఓ ఫోర్‌ బాదేశాడు. 17 ఓవర్లకు స్కోరు 126/3. ఆ తర్వాత ధోని విశ్వరూపాన్ని చూపించాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లతో అభిమానులను ఉర్రూతలూగించాడు. ధోని జోరుతో చెన్నై చివరి మూడు ఓవర్లలో 53 పరుగులు పిండుకుంది. బౌల్ట్‌ వేసిన 18వ ఓవర్లో ధోని ఫోర్‌, జడేజా సిక్స్‌ కొట్టారు. ఆ తర్వాత ధోని.. మోరిస్‌ బౌలింగ్‌లో ఫోర్‌, సిక్స్‌, బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో ఓ ఫోర్‌, రెండు సిక్స్‌లు బాదేశాడు. పవర్‌ప్లే ముగిసే సరికి 27/1తో ఉన్న చెన్నై.. ఆ తర్వాత 14 ఓవర్లలో 152 పరుగులు చేయడం విశేషం.

chennai won on delhi ipl 2019 matchనేటి మ్యాచ్ : హైదరాబాద్ vs ముంబై రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది.

Related posts