telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

జులై 30 లోపే.. చంద్రయాన్-2 .. ప్రయోగం : ఇస్రో

isro on chandrayan-2

చంద్రయాన్-2 ప్రయోగానికి అనూహ్యంగా బ్రేక్ పడిన నేపథ్యంలో.. ఈ నెలాఖరున మళ్లీ ఈ ప్రయోగం చేపట్టాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భావిస్తున్నది. ప్రయోగానికి అవసరమైన లాంచ్ విండోకు ఈ నెలలోనే అనువైన సమయం ఉన్నట్లు ఇస్రో అధికారులు చెప్తున్నారు. జూలై 1-15, జూలై 16, జూలై 29, జూలై 30 తేదీల్లో ప్రయోగానికి అనువైన లాంచ్ పీరియడ్‌లు ఉన్నట్లు ఇదివరకే గుర్తించారు. ఈ క్రమంలో ఈ నెలాఖరున 29 లేదా 30వ తేదీల్లో చంద్రయాన్-2ను ప్రయోగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాహుబలిగా పిలుస్తున్న జీఎస్‌ఎల్వీ మాక్-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-2ను సోమవారం వేకువజామున 2.51 గంటలకు ప్రయోగించాలని తొలుత నిర్ణయించిన సంగతి తెలిసిందే.

జీఎస్‌ఎల్వీలో సాంకేతిక లోపం ఏర్పడటాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగ సమయానికి 56 నిమిషాల, 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు. ఆ వెంటనే శ్రీహరికోట నుంచి ప్రత్యక్ష ప్రసారాలను కూడా నిలిపివేయడంతో అంతటా గందరగోళం ఏర్పడింది. కొద్ది నిమిషాల తరువాత ఇస్రో ఒక ప్రకటన విడుదల చేస్తూ చంద్రయాన్-2 ప్రయోగం రద్దయినట్టు తెలిపింది. వ్యోమనౌకలో సాంకేతిక సమస్యను గుర్తించామని, అందువల్ల ప్రస్తుతానికి చంద్రయాన్-2ను రద్దు చేశామని ఇస్రో అసోసియేట్ డైరెక్టర్ బీఆర్ గురుప్రసాద్ తెలిపారు. సమస్యకు కారణం ఏమై ఉంటుందనే దానిపై ఇస్రో నోరుమెదపడం లేదు. చంద్రయాన్-2ను వాస్తవానికి ఈ ఏడాది జనవరి చివరి వారంలో ప్రయోగించాలని తొలుత భావించారు. ఆ తరువాత జూలై 15వ తేదీని ఖరారు చేశారు.

ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌తో కూడిన 3,850 కిలోల అంతరిక్ష నౌకను శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రునిపైకి పంపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆదివారం రాత్రే శ్రీహరికోటకు చేరుకున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి గత వారమే పూర్తిస్థాయిలో రిహార్సల్స్ చేశారు. అనంతరం ఆదివారం ఉదయం 6.51 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. ప్రయోగానికి ముందు అవసరమైన ఇంధనాన్ని రాకెట్‌లో నింపారు. అంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఉంటే శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్వీ మాక్-3 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లి ఉండేది. ఆపై కేవలం 16.13 నిమిషాల వ్యవధిలో చంద్రయాన్-2ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టి ఉండేది. చంద్రునిపై సురక్షితంగా ఓ రోవర్‌ను దింపిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర పుటల్లోకి ఎక్కేది. ఇంతకుముందు రష్యా, అమెరికా, చైనా మాత్రమే తమ రోవర్‌లను చంద్రునిపై దింపాయి.

Related posts