telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఈసీ తీరు అత్యంత దుర్మార్గం.. కేకే శర్మను బదిలీ చేయాలి: చంద్రబాబు

AP CM Chandrababu MLC vote Tadepalli
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ ప్రవర్తించిన తీరుపై ధ్వజమెత్తారు. ఎన్నికల నేపథ్యంలో ఈసీ ప్రవర్తించిన తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని  చంద్రబాబు  ఆరోపించారు. ఈ మేరకు ఈసీ అధికారులను ఉద్దేశిస్తూ ఆయన ఎనిమిది పేజీల బహిరంగ లేఖను రాశారు. ఈసీ అధికారులు బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ని  దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం పని చేస్తోందని దుయ్యబట్టారు.  ఐటీ దాడులతో తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.  పోలీసు పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న కేకే శర్మను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో కేకే శర్మను బెంగాల్ లో నియమిస్తే, తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని గుర్తు చేసిన చంద్రబాబు, ఆయన్ను అక్కడి నుంచి తెచ్చి ఏపీపై రుద్దారని ఆరోపించారు. తృణమూల్ ఎలాంటి ఆందోళన చేసిందో అది ఏపీకి కూడా వర్తిస్తుందని అన్నారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని పోలీసు పరిశీలకుడిగా నియమించడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదన్న భావన కలుగుతోందని చంద్రబాబు తన లేఖలో అభిప్రాయపడ్డారు.
కేవలం ఏపీ వంటి రాష్ట్రాల్లోని అధికారులపైనే ఈసీ చర్యలు తీసుకుంటోందని విమర్శలు గుప్పించారు.  ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ బదిలీ పోలీసు శాఖకే తప్పుడు సంకేతాలు పంపిందని అన్నారు. ఇదే ఈసీ, ఫారమ్-7 పేరిట తప్పుడు దరఖాస్తులు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, ముఖ్య కార్యకర్తలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని చంద్రబాబు తన లేఖలో ప్రశ్నించారు.

Related posts