telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ప్రధాని పర్యటన నేపథ్యంలో.. నిరసనల హోరు.. యుద్ధం అంటున్న బాబు..

Chandrababu comments Jagan cases

నేడు ప్రధాని నరేంద్రమోడీ ఏపీలో పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రము అంతటా నిరసనలు హోరెత్తి పోతున్నాయి. టీడీపీ ఇప్పటికే ఈరోజును బ్లాక్ డే గా పాటించాలని పిలుపునిచ్చింది. మోడీ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందిస్తున్నారు. తన రాష్ట్రంపై యుద్ధం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేడు వస్తున్నారని, ఆయనకు ఏపీ ప్రజల నిరసన ఎలా ఉంటుందో తెలియజేయాలని సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం టీడీపీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, మోదీ నేతృత్వంలో దేశంలోని వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని నిప్పులు చెరిగారు.

దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో మోదీపై తీవ్రమైన ఆగ్రహం ఉందని, ఆయన ఏ రాష్ట్రానికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛదంగా ముందుకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిరసనలన్నీ శాంతియుతరంగా సాగాలని, ప్రజలు తమలోని ఆగ్రహాన్ని మోదీకి తెలిసేలా చేయాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తప్ప, ప్రతిఒక్కరూ మోదీ రాకను వ్యతిరేకిస్తున్నారని, మోదీ సభకు ప్రజలను తరలిస్తామని ఆ పార్టీ నాయకులు ఇచ్చిన హామీ మేరకే మోదీ, తన పర్యటనను ఖరారు చేసుకున్నారని విమర్శల వర్షం కురిపించారు.

కన్నా లక్ష్మీనారాయణ వైకాపా పార్టీకి ఏజంటు వంటి వాడని చంద్రబాబు విమర్శించారు. రాష్టానికి అన్యాయం చేసిన మోదీని ప్రశ్నించడంలో జగన్ పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు. తాను మోదీపై అవిశ్వాసాన్ని పెడితే, తన ఎంపీలతో రాజీనామా చేయించిన ఘనత జగన్ దని, రాజీనామాలతో మోదీ సర్కారుకు మేలు చేయించినట్లయిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగు జాతికి జగన్ తక్షణం క్షమాపణలు చెప్పాలని లేకుంటే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.

Related posts