telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బడ్జెట్ చూస్తేనే .. పాలన ఎంత ఘోరంగా ఉంటుందో తెలుస్తుంది.. : చంద్రబాబు

chandrababu

ఏపీ వార్షిక బడ్జెట్ పై చంద్రబాబునాయుడు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ గారు నోటికొచ్చినట్టు హామీలు గుప్పించి చిటికెల పందిరి నిర్మించారంటూ ఎద్దేవా చేశారు. ఆ చిటికెల పందిరిపై అభివృద్ధి, ప్రజాసంక్షేమాన్ని పాకించి పంట పండిస్తామంటున్నారని ట్వీట్ చేశారు. జగన్ పాలన ఎంత అధ్వానంగా ఉండబోతోందన్న విషయం బడ్జెట్ తో స్పష్టమైందని పేర్కొన్నారు. ఏం కట్టాలని రాజధానికి రూ.500 కోట్లు, కడప స్టీల్ ప్లాంట్ కు రూ.250 కోట్లు కేటాయించారని వ్యంగ్యం ప్రదర్శించారు. అసలిది అయ్యే పనేనా? అంటూ చంద్రబాబు పెదవి విరిచారు. ఈ సందర్భంగా చంద్రబాబు సున్నా వడ్డీ రుణాలపై కూడా స్పందించారు.

సున్నా వడ్డీ రుణాలకు మాత్రం రూ.1,788 కోట్లు కేటాయించారు కానీ, డ్వాక్రా మహిళలకు ఐదేళ్ల వ్యవధిలో రూ.75 వేలు ఇస్తామన్న హామీ, డ్వాక్రా రుణాల రద్దు హామీలను మాత్రం బడ్జెట్ లో విస్మరించారు, మరీ ఇంత మోసం అయితే ఎలా? అంటూ మండిపడ్డారు. అప్పట్లో మేము 5 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయిస్తే, రాష్ట్రంలో కోటి 72 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడా కోటి 72 లక్షల మంది నిరుద్యోగుల గురించి ఎలాంటి ప్రస్తావన మీ బడ్జెట్ లో కనిపించలేదు. ఆ నిరుద్యోగులకు ఏమిస్తున్నారో జగన్ గారే చెప్పాలి” అంటూ విమర్శల జడివాన కురిపించారు.

Related posts