telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైతుల నిరసనల మధ్య .. ఏపీ రాజధానిలో బాబు పర్యటన..

chandrababu

నేడు చంద్రబాబునాయుడు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ వివాదాస్పద ప్రకటనలు, ప్రభుత్వం నిపుణుల కమిటీ వేయటం, తదనంతర పరిణామాలతో అమరావతి నిర్మాణంపై నీలినీడలు అలుముకున్న నేపథ్యంలో బాబు ఆ ప్రాంతంలో పర్యటించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధానిగా అమరావతిని చంద్రబాబు ఎంపిక చేశారు. ఆ మేరకు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టి దేశ, విదేశీ ప్రతినిధుల సమక్షంలో సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్రమోదీచే శంకుస్థాపన చేయించారు. కొన్ని నిర్మాణాలు సైతం ప్రారంభమై పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ క్రమంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన ఆరు నెలలుగా రాజధాని నిర్మాణాన్ని పక్కన బెట్టింది.

రాజధాని నిర్మాణంపై నిపుణుల కమిటీని సైతం నియమించింది. రాజధాని నిర్మాణం నిలిపివేయడాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో పాటు పలు గ్రామాల రైతులు ఆక్షేపించారు. నెల రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలు అమరావతిలో పర్యటించి నిర్మాణాలను పరిశీలించి వచ్చారు. తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని పర్యటనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ప్రతిపక్ష, అధికార పక్ష నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే పరిస్థిత నెలకొంది. నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలు కలలుగన్న అద్భుత రాజధానికి పూనాది రాళ్లు వేసి ప్రారంభించి ప్రపంచ దేశాలన్నీ అమరావతి వైపే చూసే విధంగా తమ అధినేత చంద్రబాబు తీర్చిదిద్దారని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ చంద్రబాబుపై కక్ష పెంచుకుని రాజధానిని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందంటున్నారు. అసలు రాజధానిలో ఏం జరిగింది, ఏమి జరగబోతోంది అనే విషయాలు ప్రపంచానికి తెలియజేసేందుకే తమ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారని పేర్కొంటున్నారు. వీరి వాదనలు ఇలా ఉంటే అధికార పక్ష నేతలు మాత్రం ఎదురు దాడి చేస్తున్నారు.

https://crda.ap.gov.in/APCRDAV2/Views/crdavideos.aspx

గత ఐదు సంవత్సరాల్లో రాజధానిని పూర్తిగా విస్మరించిన బాబు ఒక్కటంటే ఒక్కటి కూడా శాశ్వత నిర్మాణం చేపట్టలేదని, రాజధానిపై స్పష్టమైన వైఖరితో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లి రాజకీయం చేసేందుకు బాబు పర్యటించనున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మాకు తీవ్ర అన్యాయం జరిగిందని, బాబును నమ్మి వేలాది ఎకరాలు ఇస్తే చివరకు తమకు ఏమీ మిగలలేదని ఓ వర్గం అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాజధానిపై సానుకూలంగా ఉన్న నేపథ్యంలో, అన్యాయం చేసిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ పర్యటిస్తారని అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులు ఆక్షేపిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పిన తరువాతే ఆయన పర్యటించాలని డిమాండ్ చేస్తున్నారు. కాదని పర్యటిస్తే తప్పకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.

Related posts