telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

చంద కొచ్చర్.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు హాజరు ..

chandakochar attended before ED

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద కొచ్చర్, వీడియోకాన్ సంస్థకు అప్పనంగా రుణాలిచ్చి, లబ్దిని పొందారన్న ఆరోపణలపై, నేడు ఉదయం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో తన భర్తతో పాటే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె, ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రాగా, అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు.

నేటి సాయంత్రం వరకూ విచారణ కొనసాగుతుందని సమాచారం. వాస్తవానికి ఈ నెల 5వ తేదీనే ఆమె విచారణకు హాజరు కావాల్సి వుంది. అయితే, ఆమె తన వ్యక్తిగత కారణాలను సాకుగా చూపుతూ విచారణకు రాకపోవడంతో, ఆమెతో పాటు, ఆమె భర్త దీపక్ కొచ్చర్ లకు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది.

ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్ కు రూ. 3,250 కోట్ల రుణం లభించగా, దీపక్ కు చెందిన కంపెనీలో వీడియోకాన్ భారీగా పెట్టుబడులు పెట్టిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే, చంద కొచ్చర్ ను బ్యాంకు సీఎండి పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే.

Related posts