telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

హై కోర్టు న్యాయమూర్తిపై .. సిబిఐ దర్యాప్తునకు అనుమతి ..

cbi inquiry on high court lawyer by gogoi

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్‌ దేశ న్యాయవ్యవస్ధలోనే తొలిసారిగా ఒక అవినీతి కేసుకు సంబంధించి సిట్టింగ్‌ హై కోర్టు న్యాయమూర్తిపై సిబిఐ దర్యాప్తునకు అనుమతించారు. అలహాబాద్‌ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శుక్లాపై సిబిఐ దర్యాప్తుకు బుధవారం ఆయన అనుమతించారు. లక్నోకు చెందిన జిసిఆర్‌జి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో 2017-2018 సంవత్సరానికి గాను ప్రవేశాల విషయంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి తుది గడువును పొడిగిస్తూ జస్టిస్‌ శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు కేవలం రెండు రోజుల ముందు వైద్య కళాశాలల్లో ప్రవేశాల విషయమై హైకోర్టు జోక్యాన్ని నివారిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

జస్టిస్‌శుక్లా సొంత ధర్మాసనం జారీచేసిన ఉత్తర్వులలో కొన్ని అంశాలను తానే స్వయంగా తన చేతి రాతతో మార్పులు చేశారు. దీంతో శుక్లాపై పలు ఫిర్యాదులు వచ్చాయి. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మిశ్రా న్యాయమూర్తుల కమిటీని నియమించి శుక్లాపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయించారు. ప్రైవేటు వైద్య కళాశాలకు అనుకూలంగా వ్యవహరించి నేరానికి పాల్పడ్డారని న్యాయమూర్తుల పానెల్‌ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది.ఈ క్రమంలో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ మేరకు ప్రవేశాల గడువును పొడిగిస్తూ శుక్లా నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన హై కోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

అంతకుముందు సరైన మౌలిక సదుపాయాలు, ఉన్నత ప్రమాణాలు లేని పలు వైద్యకళాశాలల్లో విద్యార్ధుల ప్రవేశంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ కళాశాల జాబితాలో జిసిఆర్‌జి కూడా ఉంది. ఈ క్రమంలో తన పదవికి రాజీనామా చేయడం గాని, స్వచ్ఛంద పదవీ విరమణ గాని చేయాలని జస్టిస్‌ శుక్లాను అంతకుముందు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా కోరారు. జస్టిస్‌ శుక్లా దీనికి నిరాకరించారు. దీంతో 2018లో ఆయనకు విధుల కేటాయింపును నిలిపివేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి అనుమతి లేకుండా సిట్టింగ్‌ జడ్జిపై కేసు నమోదు చేయకూడదు. దీంతో ఆయనపై దర్యాప్తుకు అనుమతించాలని కోరుతూ జస్టిస్‌ రంజన్‌ గొగొరుకి సిబిఐ లేఖ రాసింది. ఈ క్రమంలో జస్టిస్‌ శుక్లాను అభిశంసించేందుకు పార్లమెంట్‌లో తీర్మానం చేయాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొరు గత నెలలో ప్రధాని మోడీకి లేఖ రాశారు.

Related posts