telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ప్రచారానికి డబ్బులున్నా ఇవ్వండి.. లేదా.. కిడ్నీ అమ్ముకోనివ్వండి.. : కిశోర్ సమరితే

ఓ అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి కావాల్సిన రూ.75 లక్షలు ఇస్తారా లేకపోతే కిడ్నీ అమ్ముకోడానికి అనుమతి ఇస్తారా అంటూ ఎన్నికల సంఘాన్ని కోరడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ నియోజకవర్గానికి చెందిన కిశోర్‌ సమరితే స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం కోసం డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే..లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి గరిష్ట వ్యయ పరిమితిని ఎన్నికల సంఘం రూ.75 లక్షలుగా నిర్ణయించింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎన్నికల అధికారికి కిశోర్‌ లేఖ రాశారు. ‘ఎన్నికల ప్రచారానికి తగినంత డబ్బు నా వద్ద లేదు. రూ.75లక్షలు ఇవ్వండి లేకపోతే ఏదైనా బ్యాంకు రుణం పొందేలా సహకరించండి. ఇవన్నీ కుదరకపోతే నా కిడ్నీల్లో ఒకదాన్ని అమ్ముకోడానికి అనుమతి ఇవ్వండి’ అని దానిలో పేర్కొన్నారు.

మీడియాతో ఆయన మాట్లాడుతూ, నా ఎన్నికల ప్రచారానికి కేవలం 15 రోజుల మాత్రమే సమయం ఉంది. ఇంత తక్కువ సమయంలో నేను అంతమొత్తాన్ని వసూలు చేయలేను. అందుకే రూ.75లక్షలు ఇవ్వమని ఎన్నికల సంఘాన్ని కోరాను. నా ప్రత్యర్థులంతా అవినీతిపరులు. వారు అనైతికంగా స్థానికుల నుంచి డబ్బు వసూలు చేశారు. నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, పేదవారి ఉన్నతికి కృషి చేయాలనుకుంటున్నాను’ అని అన్నారు. ఈయన గతంలో సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే. ఏప్రిల్ 29, మే 6, 12, 19 తేదీల్లో మధ్యప్రదేశ్‌లో వివిధ దశల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు . మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Related posts