• Home
  • Trending Today
  • “కేరాఫ్ కంచరపాలెం” మా వ్యూ
Trending Today రివ్యూలు సమీక్ష వార్తలు సినిమా వార్తలు

“కేరాఫ్ కంచరపాలెం” మా వ్యూ

C/o Kancharapalem-Movie-review

బ్యానర్ : సురేష్ ప్రొడక్షన్స్
నటీనటులు : సుబ్బారావు, రాధా బెస్సి, మోహన్ భగత్, ప్రవీణ పరుచూరి, కార్తీక్ రత్నం, ప్రణీత పట్నాయక్, కేశవ కర్రీ, నిత్యశ్రీ గోరు తదితరులు
దర్శకత్వం : వెంకటేష్ మహా
సమర్పణ : దగ్గుబాటి రానా
సంగీతం : స్వీకర్ అగస్తి
నిర్మాత : విజయ ప్రవీణ పరుచూరి

సురేష్ ప్రొడక్షన్స్ అనే ప్రముఖ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాకు గుర్తింపు లభించింది. ఇక స్టార్ హీరో రానా ఈ చిత్రానికి సమర్పకుడిగా ఉండి సినిమాను ప్రమోట్ చేయడంతో సినిమాపై అందరికీ ఆసక్తి నెలకొంది. పక్కా తెలుగు నేటివిటీతో రూపొందిన చిత్రమే “కేరాఫ్ కంచరపాలెం”. సెప్టెంబర్ 3న ఈ “కేరాఫ్ కంచరపాలెం” సెలబ్రిటీ ప్రివ్యూ వేశారు. ఈ సినిమా చూసిన సెలెబ్రిటీలంతా ప్రశంసల వర్షం కురిపించడంతో సినిమా విడుదల గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన “కేరాఫ్ కంచరపాలెం” సినిమా సెలెబ్రిటీలకైతే నచ్చింది… మరి సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా.. లేదా… అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ :
కంచరపాలెం అనే గ్రామంలోని గవర్నమెంట్ ఆఫీస్ లో అటెండర్ గా పని చేస్తాడు రాజు (సుబ్బారావు). ఆయన వయసు 49 సంవత్సరాలు. అయినా పెళ్లి కాకపోవడంతో అందరూ రాజును ఎగతాళి చేస్తుంటారు. అదే సమయంలో ఆఫీసర్ రాధ (రాధ బెస్సి) రాజు పనిచేసే ఆఫీస్ కు ఆఫీసర్ గా వస్తుంది. ఆమె వయసు 42 సంవత్సరాలు. ఆమె భర్త చనిపోతాడు. 20 ఏళ్ల కూతురు ఉంటుంది. రాజు మనస్తత్వాన్ని చూసిన రాధా అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ కుటుంబ సభ్యులు, బయటవాళ్ళు ఏమనుకుంటారో అని భయపడుతుంది.

గడ్డం (మోహన్ భగత్) ఓ వైన్ షాప్ లో పని చేస్తుంటాడు. అతను పనిచేసే వైన్ షాప్ లోనే సలీమా (ప్రవీణ పరుచూరి) ప్రతిరోజూ మందు కొంటుంది. ఆమె కళ్ళను చూసి ఇష్టపడతాడు గడ్డం. అయితే ఆమె గురించి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది గడ్డం కు. ఆ తరువాత గడ్డం ఏం చేశాడు ? గడ్డం, సలీమాల ప్రేమ కొనసాగిందా ?

జోసెఫ్ (కార్తీక్ రత్నం) అనాథ. అయితే ఆ ఊరి వ్యాయామశాల ఓనర్, రౌడీ అమ్మోరు అతన్ని చేరదీస్తాడు. దీంతో అతను చెప్పిన పని చేస్తూ ఉంటాడు జోసెఫ్. అమ్మోరు ఎవరినైనా కొట్టమని ఆదేశిస్తే కొట్టి వస్తాడు. అయితే జోసెఫ్ ఓ గొడవ సందర్భంగా భార్గవిని (ప్రణీత్ పట్నాయక్) ను చూస్తాడు. వీరిద్దరూ ముందుగా గొడవ పడతారు. క్రమేపి ఆ గొడవ కాస్తా ప్రేమగా మారుతుంది> అయితే వీరి ప్రేమకు ఓ విషయం అడ్డుగా మారుతుంది. మరి జోసెఫ్, భార్గవి ఆ విషయం వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు ? ఆ అడ్డు తొలగుతుందా లేదా ?

సుందరం (కేశవ కర్రి) అదే ఊరిలోని స్కూల్లో ఏడవ తరగతి చదువుతుంటాడు. అతని తండ్రి బొమ్మలు చేసి అమ్ముతాడు. తన క్లాసుమేట్ సునీత (నిత్యశ్రీ గోరు)ని ఇష్టపడతాడు. సునీత తనతో మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్న తరుణంలో సునీత కూడా సుందరంతో మాట్లాడుతుంది. కానీ అనుకోకుండా సునీత కుటుంబం ఊరు విడిచి వెళ్ళిపోతుంది. సునీత ఊరు విడిచి వెళ్లడంతో బాధపడిన సుందరం ఆ కోపంతో ఓ తప్పు చేస్తాడు. ఆ తప్పు సుందరం జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది ? మరి ఈ నాలుగు జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమాను వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
సినిమా మొత్తం ఎనిమిది పాత్రల చుట్టూనే తిరుగుతుంది. రాజు-రాధ, గడ్డం-సలీమా, జోసెఫ్-భార్గవి, సుందరం-సునీత పాత్రలకు ఆయా నటీనటులు ప్రాణం పోశారు. రాజు పాత్ర సినిమాలో సందర్భానుసారంగా మంచి కామెడీని పండించింది. రాధ బెస్సి కూడా తన పాత్రకు న్యాయం చేశారు. గడ్డం పాత్రలో మోహన్ భగత్ తన పాత్రలో అద్భుతంగా నటించారు. సలీమా అనే వేశ్యగా, ముస్లిం అమ్మాయిగా ప్రవీణ పరుచూరి కూడా బాగా నటించారు. జోసెఫ్, భార్గవి పాత్రల్లో కార్తీక్ రత్నం, ప్రణీత పట్నాయక్ లు కంటతడి పెట్టిస్తారు. ఇక సుందరంగా కేశవ కర్రి కూడా బాగా నటించాడు. ప్రతి ఒక్కరూ ఆయా పాత్రలను వారు తప్ప ఇంకెవరూ చేయలేరనే విధంగా నటించారు. ఎక్కడా మనకు కృత్రిమ నటన కన్పించదు.

సాంకేతిక వర్గం పనితీరు :
సినిమా అంటే మూడు ఫైట్లు, ఆరు పాటలు కాదనే విషయాన్ని నిరూపించాడు దర్శకుడు వెంకటేష్ మహా. తాను అనుకున్న పాయింట్ ను ప్రేక్షకులకు తెరపై అర్థమయ్యేలా చెప్పడంలో విజయాన్ని సాధించాడని చెప్పవచ్చు. అతి తక్కువ బడ్జెట్ లో మన నేటివిటీకి తగ్గట్టుగా అందమైన ప్రేమకథలను మలిచారు. స్వీకర్ అగస్తి పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. వరుణ్ చపేకర్, ఆదిత్య జవ్వాది కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ కూడా బాగుంది. అయితే సినిమాలో దాదాపు అందరూ కొత్తవారే కావడంతో ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికి సమయం పట్టవచ్చు. కాబట్టి సినిమాకు నటీనటులే ప్లస్, మైనస్ పాయింట్లు. మరి ఇలాంటి సాధారణ జీవిత కథలు ప్రేక్షకులను ఎంతవరకు కనెక్ట్ అవుతాయో చూడాలి.

రేటింగ్ : 3/5

Related posts

కౌశల్ నీ విజయాన్ని ఆస్వాదించు… : మహేష్ బాబు

vimala t

మీడియా మిత్రులకు 'నయన' కృతజ్ఞతలు

admin

మార్కెట్ లో బంగారం ధరలు…

chandra sekkhar

Leave a Comment