telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

లండన్ : … పార్టీకి పూర్వవైభవం తెస్తానంటున్న.. లీసా ..

british mp lisa on labor party

భారత సంతతి బ్రిటిష్ ఎంపీ లీసా నాండీ బ్రిటన్ లేబర్ పార్టీకి పూర్వ వైభవం తెస్తానని భరోసా ఇచ్చారు. 2019 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన పార్టీని బలోపేతం చేస్తానని, సంప్రదాయ కంచుకోటల్లో పునరుద్ధరిస్తానని చెప్పారు. పార్టీ నాయకత్వం కోసం జరుగుతున్న పోటీలో తాను కూడా ఉన్నానని ప్రకటించారు. లేబర్ పార్టీకి 70 ఏళ్ళలో కనీ వినీ ఎరుగనంత నష్టం 2019 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీకి కంచుకోటల వంటి నియోజకవర్గాల్లో కన్జర్వేటివ్ పార్టీ గెలిచింది. ప్రస్తుతానికి లేబర్ పార్టీ సారథ్యం కోసం నలుగురు పోటీ పడుతున్నారు. విగన్ నుంచి ఎంపీగా గెలిచిన లీసా నాండీ, బర్మింగ్‌హామ్ ఎంపీ జెస్ ఫిలిప్స్, షాడో ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎమిలీ థార్న్‌బెరీ, షాడో మినిస్టర్ ఫర్ సుస్టెయినబుల్ ఎకనమిక్స్ క్లైవ్ లూయిస్ పోటీలో ఉన్నారు. 2015 మే 11న ప్రతిపక్ష నేత హరియెట్ హర్మన్ షాడో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ పదవులకు ఎటువంటి నిర్దిష్ట బాధ్యతలు ఉండవు.

లీసా నాండీ లాంఛనంగా శుక్రవారం తన స్థానిక కాన్‌స్టిట్యుయెన్సీ పేపర్‌లో తన బిడ్‌ను ప్రకటించారు. భావి లేబర్ గవర్నమెంట్ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రతి ఊరుకి, ప్రతి పట్టణానికి, ప్రతి నగరానికి, యావత్తు దేశానికి అధికారాన్ని, వనరులను ఇస్తుందని రాశారు. స్వార్థం కోసం స్వేచ్ఛను అణగదొక్కే గత కాలపు విధానాలను పక్కన పెట్టి, ప్రజలు తమకోసం తాము మార్పును తీసుకురాగలిగే సామర్థ్యాన్ని వారికి ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను ఓడించేందుకు తాను కృతనిశ్చయంతో ఉన్నానని పేర్కొన్నారు. కారుణ్యభావంతో, చైతన్యవంతమైన ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు వారు అర్హులని, దానిని తేవడం కోసం తాను బోరిస్ జాన్సన్‌ను ఓడిస్తానని పేర్కొన్నారు.

Related posts