telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఐక్యరాజ్యసమితిలో … సంస్కరణలు అత్యవసరం .. : బ్రిక్స్‌ సభ్య దేశాలు

BRICS meet supporting req changes in UN

11వ బ్రిక్స్‌ దేశాల శిఖరాగ్ర సదస్సు వేదికగా ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు అత్యవసరమని ఆయా దేశాల నేతలు అభిప్రాయ పడ్డారు. దేశాల మధ్య సహకారం, శాంతిభద్రతల పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి దిశగా ముందుచూపు, మానవహక్కులకు రక్షణ కల్పించడం వంటి సూత్రాలను పాటిస్తూ బ్రిక్స్‌ దేశాలు అంతర్జాతీయ సమాజ భవిష్యత్తు ఉజ్వలంగా సాగేందుకు కృషి చేస్తున్నాయని వెల్లడించారు. బహుళ ధ్రువ దేశాలకు ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సహకారం, ప్రపంచ వ్యవహారాల్లో ఐరాసకు పాత్రకు మద్దతు, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం ద్వారా ముందుకు సాగుతున్నామని ఉద్ఘాటించారు. ‘బహుళ ధ్రువ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సి ఉంది.

ఐరాస, డబ్ల్యూటీఓ, ఐఎంఎఫ్‌ సహా ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ సంస్కరణలు మరింత ప్రజాస్వామ్యయుతంగా, అందరికీ ప్రాతినిధ్యం కల్పిస్తూ.. అంతర్జాతీయ నిర్ణయాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు.. మార్కెట్లకు మరింత అవకాశం కల్పించేవిగా ఉండాలి.” అని బ్రిక్స్‌ నేతలు ప్రకటించారు. న్యాయం, సమానత్వంతో కూడిన.. అందరికీ అవకాశం కల్పించే బహుళ ధ్రువ ప్రపంచ సమాజాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామని బ్రిక్స్‌ నేతలు పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలు సభ్యదేశాలన్నింటితో కలిసి నడవాలని.. అందరి ఆసక్తులను నెరవేర్చాలని వెల్లడించారు. 2005 నాటి ప్రపంచ సదస్సు తీర్మానాల ప్రకారం ఐరాసలో సమగ్ర సంస్కరణలు రావాలన్నారు. ప్రపంచ సమస్యలకు సమాధానం కల్పించే దిశగా భద్రతా మండలి సహా ఐరాసలో అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించారు.

Related posts