telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బ్రిటన్ : .. కొత్త ప్రధానిగా.. బోరిస్‌ జాన్సన్‌ …

boris johnson as new president to Britain

బ్రిటన్‌ మాజీ విదేశాంగ మంత్రి బోరిస్‌ జాన్సన్‌ భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుత ప్రధాని థెరెస్సా మే స్థానంలో ఆయన త్వరలోనే బ్రిటన్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కన్జర్వేటివ్‌ నాయకత్వ పోటీలో జాన్సన్‌కు 92,153 ఓట్లు లభించగా ఆయన ప్రత్యర్థి, ప్రస్తుత విదేశాంగ మంత్రి జెరిమీ హంట్‌కు 46,656 ఓట్లు లభించాయి. బ్రెగ్జిట్‌ను గట్టిగా సమర్ధించిన జాన్సన్‌ ఐరోపా కూటమి నుండి బ్రిటన్‌ను ఒప్పందంతో లేదా ఒప్పందం లేకుండా బయటకు తీసుకురావాల్సి వుంటుంది.

ఎటువంటి ఒప్పందమూ లేకుండా (నోడీల్‌) బ్రెగ్జిట్‌కు ప్రయత్నించే ఏ ప్రభుత్వాన్నయినా గద్దెదింపేందుకు ఎంపిలు కృతనిశ్చయంతో వుండటంతో బ్రెగ్జిట్‌ ప్రక్రియ ఆయనకు కత్తిమీద సామే అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. బుధవారం తన పదవి నుండి వైదొలగనున్న ప్రధాని థెరెస్సా మే బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కువెళ్లి ఎలిజెబెత్‌ రాణికి తన రాజీనామా లేఖను లాంఛనంగా అందచేయనున్నారు. అనంతరం రాణి బోరిస్‌ జాన్సన్‌ను కొత్త ప్రధానిగా లాంఛనంగా ప్రకటిస్తారు.

బ్రిటన్‌ ప్రజలు 2016 రిఫరెండంలో ఐరోపా కూటమి నుండి నిష్క్రమించాలంటూ మెజార్టీ తీర్పు వెలువరించిన తరువాత బ్రెగ్జిట్‌ మద్దతుదారు ప్రభుత్వ సారధిగా ఎన్నిక కావటం ఇదే తొలిసారి. ఇప్పటికే ఇద్దరు ప్రధానులను గద్దె దించిన బ్రెగ్జిట్‌ అంశం బ్రిటన్‌పై తన పట్టును మరింత బిగిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts