telugu navyamedia
రాజకీయ

యోగి ర్యాలీని అడ్డుకుంటే బెంగాల్‌ బంద్‌ కు పిలుపు: బీజేపీ

సీబీఐ వివాదంతో పశ్చిమ బెంగాల్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య సాగుతున్న కోల్డ్‌ వార్‌ తీవ్రస్ధాయికి చేరింది. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ర్యాలీని అడ్డుకుంటే బెంగాల్‌ బంద్‌కు పిలుపిస్తామని బీజేపీ హెచ్చరించింది. పురూలియా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించేందుకు బెంగాల్‌ అధికారులు ఆయన హెలికాఫ్టర్‌ ల్యాండయ్యేందుకు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం లక్నో నుంచి జార్ఖండ్‌లోని బొకారోకు చాపర్‌లో చేరుకున్న యోగి అక్కడి నుంచి ర్యాలీకి వేదికైన పురూలియాకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు.
పురూలియాలో యోగి ర్యాలీని అడ్డుకుంటే బెంగాల్‌ బంద్‌ చేపడతామని బీజేపీ నేత విశ్వప్రియ రాయ్‌ చౌధరి హెచ్చరించారు. మరోవైపు ముర్షిదాబాద్‌లో బీజేపీ ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించారు. గతంలో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ర్యాలీలకూ బెంగాల్‌ అధికారులు అడ్డంకులు సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా యూపీలో పరిస్థితిని చక్కదిద్దుకోలేని యోగి బెంగాల్‌ చుట్టూ తిరుగుతున్నారని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.

Related posts