telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఈశాన్య రాష్ట్రాలపై .. బీజేపీ ప్రత్యేక వ్యూహం.. దర్శకుడు వారే.. !

2014లా ఇప్పుడు గెలుపు అంత సులభం కాదని చెబుతున్నారు. నాడు బీజేపీ ఒంటరిగా గెలిచిన 282 స్థానాల్లో గెలిచింది. ఇందులో కేవలం యూపీలోనే డెబ్బైకి పైగా సీట్లు దక్కించుకుంది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనే దాదాపు డబుల్ సెంచరీ సాధించింది. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. యూపీలో దాదాపు ముప్పైకి పైగా సీట్లు తగ్గే అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ఇప్పుడు కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా బీజేపీయే ఎక్కువ సీట్లు గెలుస్తుందని సర్వేలు చెబుతున్నప్పటికీ.. 2014 కంటే మాత్రం తక్కువ వచ్చేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.

దూరమైన పాతమిత్రులను కొందరిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేసి సఫలమైంది. ఎన్డీయే కూటమి నుంచి కొన్ని పార్టీలు వెళ్లిపోవడంతో మరికొన్ని పార్టీలను చేర్చుకుంటున్నాయి. శివసేన, అసోం గణపరిషత్ వంటి పార్టీలు ఎన్డీయేకు దూరం జరిగి.. ఎన్నికల సమయంలో దగ్గరయ్యాయి. మళ్లీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అన్నాడీఎంకే వంటి కొత్త మిత్రులు జత కలిశారు. ఓ వైపు పాత మిత్రులను దగ్గర చేసుకుంటూ, కొత్త మిత్రులతో కలిసి బరిలోకి దిగుతూ, మరోవైపు, ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తరాదిన తాము కోల్పోతామని భావిస్తున్న స్థానాలను దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో ఒంటరిగా లేదా మిత్రపక్షాలతో కలిసి గెలవాలనుకుంటోంది. మరోవైపు, వైయస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలతో లోపాయికారి ఒప్పందం ఉందని, ఆ పార్టీలు ఎన్నికల తర్వాత బీజేపీకే మద్దతిస్తాయనే వాదన కూడా ఉంది.

బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. అక్కడి 8 రాష్ట్రాల్లోని 25 లోకసభ సీట్లలో కనీసం 22 సీట్లను గెలుచుకునే దిశలో పావులు కదుపుతోంది. ఆయా రాష్ట్రాల్లో పలు పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. ఈ పొత్తుల్లో తెలుగు వ్యక్తి, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చక్రం తిప్పుతున్నారు. ఆయన కొద్ది రోజులుగా వివిధ పార్టీలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఏజీపీ లాంటి పాత మిత్రుల్ని మళ్లీ కూటమిలోకి తేవడంలో సఫలమయ్యారు. బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్), ఇండిజీనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ), నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతికారీ మోర్చా తదితర పార్టీలు/కూటములతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని చెప్పారు. తాము నార్త్ ఈశ్ట్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్‌ఈడీఏ) పేరుతో కూటమిగా ఏర్పడ్డామని, చైర్మన్‌గా హిమంత బిశ్వ శర్మ వ్యవహరిస్తారని రామ్ మాధవ్ బుధవారం తెలిపారు.

ఇదో చారిత్రకమైన రోజు అని, ఈశాన్య రాష్ట్రాల్లోని 25 సీట్లలో తమ కూటమి 22 చోట్ల సత్తా చాటుతుందని, మోడీ మరోసారి ప్రధాని కావడంలో కూటమి కీలకపాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. అసోం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ ముఖ్యమంత్రులుశరబానంద్ సోనోవాల్, నెఫ్యూరియో, కాన్రాడ్ సంగ్మా, బిప్లవ్ కుమార్ దేవ్, ఫెమా ఖండూ, బీరెన్ సింగ్‌లతో పొత్తులను చర్చించి, ఖరారు చేశామన్నారు.

Related posts