telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

గ్రేటర్ లో బీజేపీ రాకతో చిక్కులు ఎవరికి…?

bjp party

నాలుగేళ్ల క్రితం నాలుగు సీట్లే. ఇప్పుడు..40 సీట్లు దాటేసి 50కి దగ్గరగా వచ్చింది. టీఆర్ఎస్‌ను దారుణంగా దెబ్బ తీసింది. బీజేపీకి ఈసారి సీట్లు పెరుగుతాయని అనుకున్నా… అది ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ప్రజల్లో భారతీయ జనతా పార్టీకున్న ఆదరణ సర్వే సంస్థల అంచనాలకు కూడా అందలేదు. చాలా తక్కువ కాలంలో బీజేపీ ఇంతలా పుంజుకోవడానికి కారణమైన వ్యూహమేంటి?. పదునైన వ్యూహాలు. గ్రౌండ్ లెవల్లో వాటిని అమలు చేసే కార్యకర్తలు, నాయకులు. ఇదే బీజేపీకి బలం. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో విజయం, అన్నింటికీ మించి దుబ్బాక థ్రిల్లర్‌ను గెలుచుకున్న తీరు బీజేపీలో ఉత్సాహాన్ని ఒక రేంజ్‌కు తీసుకెళ్లింది. దుబ్బాక ఇచ్చిన కిక్ చల్లారక ముందే గ్రేటర్ ఎన్నికలు రావడంతో.. రెట్టించిన ఉత్సాహంతో రంగంలోకి దిగారు కమలనాధులు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ వ్యూహం చాలా క్లియర్‌గా ఉంటోంది. ప్రత్యర్థులు ఆ వ్యూహాలను అర్థం చేసుకుని ఎదురు దాడి చేసే టైమ్ కూడా ఉండటం లేదు. బూత్ లెవల్లో కార్యకర్తల్ని బలోపేతం చేయడం, వార్డులు, డివిజన్లు, నియోజకవర్గాల వారీగా నాయకులకు లక్ష్యాలు ఇవ్వడం.. లక్ష్యాల సాధన కోసం రేయింబవళ్లు పని చేయడం.. ఇదే బీజేపీ వ్యూహం. బీజేపీ సోషల్ మీడియా పార్టీకి అదనపు బలం.

వీటన్నింటికి తోడు సుడిగాలిలా వచ్చి పడే జాతీయ స్థాయి నాయకులు.. ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి తీసుకోకుండా దాడి చేస్తోంది కమలదళం. గ్రేటర్‌లో ఎంఐఎం బలంగా ఉండటంతో.. బీజేపీకి కొత్త అజండా అవసరం లేకుండా పోయింది. పార్టీ అధ్యక్షుడు సంజయ్ నగరంలోకి వచ్చీ రావడంతోనే ఎంఐఎం మీద యుద్ధం ప్రకటించారు. పాతబస్తీలో భాగ్యలక్ష్మి ఆలయం నుంచే ప్రచారం ప్రారంభించి భావోద్వేగాలను తట్టి లేపారు. సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ ఓట్ల తేనెతుట్టెను కదిపారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూలుస్తామన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలు బీజేపీకి అవసరమైన ఇంధనాన్ని ఇచ్చాయి. అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో హిందూ ఓట్ల  పోలరైజేషన్ మొదలు పెట్టింది కమలదళం. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ- కాంగ్రెస్ మధ్య చీలిపోయేది. టీఆర్‌ఎస్‌కి ఆల్టర్నేటివ్ తామేనని ఓటర్లలోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా బీజేపీకి పడింది. రెండు నియోజకవర్గాల్లోని అన్ని డివిజన్లలో కాషాయ జండా ఎగిరింది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్‌ను ఒక రేంజ్‌లో అమలు చేసింది కమలదళం. పెద్ద నేతలతో పాటు చోటా మోటా నాయకులను కూడా పార్టీలో చేర్చుకుంది. వరదల సమయంలో ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆరోపణల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయింది. పదివేల రూపాయలు అందకుండా బీజేపీ నేతలు అడ్డుపడ్డారని ఆరోపించడం… దానిపై సంజయ్ చేసిన సవాల్‌ను స్వీకరించకపోవడం టీఆర్‌ఎస్‌కు మరో మైనస్‌. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఇతర హామీల విషయంలో టీఆర్ఎస్ వైఫల్యాలు బీజేపీకి అనుకూలంగా మారాయి. తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీకి గ్రేటర్ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇదే ఊపుతో నాగార్జునసాగర్ ఉపఎన్నికలో దూకుడుగా వ్యవహరిస్తుందనడంలో ఎవరికీ సందేహం ఉండకపోవచ్చు. రానున్న రోజుల్లో ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వలసలు భారీగా పెరిగే అవకాశం ఉంది.  

Related posts