telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు శుభాకాంక్షల వెల్లువ

Prabhas

ఈరోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువలా కురుస్తున్నాయి. సెలెబ్రిటీలతో సహా ఆయన అభిమానులు ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “బాహుబలి” అంటే ఇలాగే ఉంటాడేమో అన్పించే ఆ కట్ అవుట్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటి చెప్పిన బాహుబ‌లి సినిమాతో ఆ హీరో పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా పాకింది. బాహుబ‌లి కోసం దాదాపు నాలుగున్న‌ర ఏళ్లు క‌ష్ట‌ప‌డ్డ ప్ర‌భాస్ అందుకు త‌గ్గ ప్ర‌తిఫ‌లం పొందాడు. నేష‌న‌ల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎంత ఎదిగిన ఒదిగి ఉండాల‌నే గుణం ప్ర‌భాస్‌ది. 2002లో ఈశ్వ‌ర్ సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన ప్రభాస్ వ‌ర్షం సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొట్టాడు. ఛ‌త్ర‌ప‌తి చిత్రం ప్ర‌భాస్‌కి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌రింత పెరిగేలా చేసింది. డార్లింగ్, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌, మిర్చి ఇలా వ‌రుస హిట్స్ తో స్టార్ స్టేట‌స్ పొందాడు ప్ర‌భాస్. అయితే మంచి క్రేజ్ ఉన్న సమ‌యంలో సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భాస్ అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయేలా బాహుబ‌లి సినిమా కోసం ఐదుఏళ్ళు కాల్ షీట్స్ ఇచ్చాడు. బాహుబ‌లి సినిమా విజ‌యం వెనుక రాజ‌మౌళి క‌ష్టం ఎంత ఉందో, అంత క‌న్నా ఎక్కువ ప్ర‌భాస్ క‌మిట్‌మెంట్ ఉంద‌నే చెప్పాలి. టాలీవుడ్‌లో సినిమాకి సంబంధించిన ఏ రికార్డ్ అయినా కూడా నాన్ బాహుబలి అనే క్యాటగిరిలో లెక్కిస్తున్నారు. బాహుబ‌లి భారీ విజ‌యం సాధించిన‌ప్పుడు పొంగిపోని ప్ర‌బాస్, సాహో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న‌ప్పుడు కూడా కుంగిపోలేదు. అందుకే అత‌ను మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అని అంద‌రితో అనిపించుకుంటున్నాడు. త్వ‌ర‌లో మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించ‌నున్న ప్రభాస్ ఇలాంటి పుట్టిన రోజు వేడుక‌లు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని ప్రేక్షకలోకం కోరుకుంటోంది.

Related posts