telugu navyamedia
వ్యాపార వార్తలు

40కే భోజనం.. 10కే రెండు సమోసాలు…ఇంటికే తెస్తారట.. 

big bazar new venture in food supply
బిగ్ బజార్ ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులు అమ్ముతూ, వాటిని ఇంటివరకు సరఫరా కూడా చేస్తుంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి, తెలుగు భోజనం, చిరు ఆహారం కూడా.. ఇంటికి సరఫరా చేసే ప్రయత్నం చేసేందుకు సిద్ధం అయ్యారు. ఆహార వ్యాపారాన్ని స్థిరీకరించడంలో భాగంగా ‘ఆహార పదార్థాల’ విక్రయంలోకి ప్రవేశిస్తున్నట్లు ఫ్యూచర్‌గ్రూప్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) కిశోర్‌ బియానీ తెలిపారు. కేంద్రీకృత వంటశాలల నుంచి వీటిని కొనుగోలుదార్లకు అందుబాటు ధరల్లో సరఫరా చేస్తామన్నారు. తమ డిజిటల్‌ వాలెట్‌ ఫ్యూచర్‌పే కార్యకలాపాల విస్తరణలో భాగంగా, అందుబాటు ధరలో ఆహార పదార్థాలను ఇళ్ల వద్దకే పంపిస్తామని వివరించారు. ‘తినడానికి సిద్ధంగా ఉండే ఆహారాన్ని వినియోగదారుల ఇళ్లకు రూ.40కే సరఫరా చేయాలన్నది మా యత్నం. ఇందుకోసం కేంద్రీకృత వంటశాలలు (క్లౌడ్‌కిచెన్‌) ఉపయోగించుకుంటాం. ఈ ప్రాజెక్టును సాకారం చేయడంపై దృష్టి సారించాం’ అని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన బియానీ విలేకరులతో చెప్పారు. ‘ప్రతి నగరంలో ఉండే వంటశాలల్లో తయారైన తాజా ఆహార పదార్థాలను, నేరుగా ఇళ్లకు సరఫరా చేయాలన్నది ప్రణాళిక. స్థానిక అవసరాలకు అనుగుణమైన ఆహారాన్నే సిద్ధం చేస్తాం’అని బియానీ వెల్లడించారు. 
‘ఆయా నగరాల్లో నెలకొల్పే వంటశాలల్లో ఆహార పదార్థాలను వండి, ప్యాక్‌ చేసి, ఇళ్లకు పంపుతారు. అయితే ఈ వంటగదుల వద్ద భుజించేందుకు వీలుండద’ని తెలిపారు. కేంద్రీకృత వంటశాలలు అతి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పిన బియానీ, ఎన్ని నెలకొల్పుతున్నారు, ఇళ్లకు చేరవేసేందుకు ఏ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటారనే విషయాలు తెలిపేందుకు నిరాకరించారు. ‘బియ్యంతో తయారు చేసే భోజనాన్ని సిద్ధం చేస్తాం. ఇదే సమయంలో రూ.10కి 2 సమోసాలు కూడా పొందొచ్చు’ అని తెలిపారు. ఆహార పదార్థాలను ఇళ్లకే చేరవేసేందుకు, ఫ్యూచర్‌పే యాప్‌ను వినియోగించుకుని, తథాస్తు డిజిటల్‌ ప్రాజెక్ట్‌ కింద చేపట్టాలన్నది గ్రూప్‌ ప్రణాళికగా కిశోర్‌ బియానీ వెల్లడించారు. ‘ఈ ప్రాజెక్టుపై పెద్దఎత్తున ఆశావహంగా ఉన్నాం. అందుబాటు ధర కనుక, తక్కువ మార్జిన్‌ ఉన్నా, వినియోగదారులకు సంతృప్తికరంగా అందించేందుకు, తమ సంస్థ నెట్‌వర్క్‌ను సమర్థంగా వాడుకుంటాం’ అని తెలిపారు. 
మా గ్రూప్‌లోనే బియ్యపు మిల్లులు, పిండి మిల్లులున్నాయి. సొంత కంపెనీలు, సరఫరా వ్యవస్థలు, సొంత బ్రాండ్‌ ఉత్పత్తులున్నాయి. వీటన్నింటినీ వాడుకుంటాం. ఒకవేళ ఎవరైనా మార్జిన్‌తో సరఫరా చేస్తే, అవీ తీసుకుంటాం’ అని కిశోర్‌ బియానీ పేర్కొన్నారు.  ఫ్యూచర్‌ గ్రూప్‌ వ్యాపారంలో 50 శాతం, ఆహార విభాగం నుంచే లభిస్తోందని, ఆధార్‌, ఈజీడే, ఫ్యూచర్‌స్టోర్లను విస్తరించడం వల్ల, రాబోయే అయిదేళ్లలో ఈ విభాగ ఆదాయం 60 శాతానికి చేర్చాలన్నది ప్రణాళికగా చేసుకున్నట్టు బియానీ తెలిపారు.

Related posts