telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మళ్ళీ జట్టులోకి రావడానికి .. బుమ్రా కఠిన సాధన..

bhumra on personal special training

భారత ఆటగాడు జస్ప్రీత్‌ బుమ్రా మైదానంలోకి ఎంత త్వరగా అడుగు పెడదామా అని ఎదురుచూస్తున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ ట్రైనర్‌ రజనీకాంత్‌ శివజ్ఞానమ్‌ నేతృత్వంలో ముంబయి క్రికెట్‌ సంఘంలో కఠిన సాధన చేస్తున్నాడు. సెప్టెంబర్‌లో బుమ్రా వెన్నుగాయం బయటపడింది. వెన్నెముక దిగువ భాగంలో చిన్న చీలిక ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ సిరీసులకు దూరమయ్యాడు. డిసెంబర్‌ 6 నుంచి మొదలయ్యే వెస్టిండీస్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌కూ అందుబాటులో ఉండటం లేదు. ఎంసీఏలో బుమ్రా శిక్షణ పొందుతున్నాడు. వ్యక్తిగతంగా ఏర్పాట్లు చేసుకున్నాడని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వచ్చేఏడాది న్యూజిలాండ్‌ పర్యటనకు సిద్ధమవ్వాలని బుమ్రా పట్టుదలగా ఉన్నాడు. 2020 జనవరి 24న ఈ సిరీస్‌ మొదలవుతుంది.

కివీస్‌తో కోహ్లీసేన ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. దిల్లీ ఫ్రాంచైజీకి పనిచేస్తున్నప్పటికీ ఐపీఎల్‌ లేని సమయంలో శివజ్ఞానమ్‌ ఆటగాళ్లకు వ్యక్తిగతంగా పనిచేస్తాడని తెలిసింది. ఐపీఎల్‌లో దిల్లీ జట్టుకు సేవలు అందించడం శివజ్ఞానమ్‌ ప్రధాన వృత్తి. లీగు లేనప్పుడు ఆటగాళ్లు ఎవరైనా సంప్రదిస్తే వ్యక్తిగతంగా పనిచేస్తాడు. ఇది ఆ రెండు పార్టీల మధ్య కుదిరిన వ్యక్తిగత ఒప్పందం అని దిల్లీ వర్గాలు తెలిపాయి. టీమిండియా కండిషనింగ్‌ కోచ్‌ పదవికి శివజ్ఞానమ్‌ దరఖాస్తు చేశాడు. న్యూజిలాండ్‌కు చెందిన నిక్‌వెబ్‌ దీనికి ఎంపికైన సంగతి తెలిసిందే.

Related posts