telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మహా నగరంగా.. భీమిలి .. : విజయసాయి

ఏపీలో అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఆకాంక్షించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. రాజధాని ఏర్పాటుతో భీమిలి పట్టణం మహా నగరంగా మారుతుందని విజయసాయి రెడ్డి తెలిపారు. చినగదిలి మండలం కొమ్మాదిలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో శనివారం ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…’ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ను విశాఖకు తరలిస్తున్నామని నిర్ణయం తీసుకుంటే… దానికి చంద్రబాబు నాయుడు అడ్డుపుల్ల వేస్తున్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మహోద్దేశంతో రాజధానిని నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

రాజధానిని విశాఖకు తరలించడం వల్ల ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. భీమిలి ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాసరావు ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి. ఆయన హయాంలోనే రాజధాని విశాఖకు రావడం సంతోషకరమైన విషయం. అలాగే రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో, అన్ని సామాజిక వర్గాలకి, అన్నిప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు 13 జిల్లాలు…భవిష్యత్‌లో 25 జిల్లాలు… అన్ని కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలన్న కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉన్నారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్య నారాయణతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. మరోవైపు భీమిలి మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌ కొప్పుల ప్రభావతి, కొప్పుల రమేష్‌తో పాటు పలువురు వైఎస్సార్‌ సీపీలో చేరారు.

Related posts