telugu navyamedia
క్రీడలు

పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భవీనాబెన్‌

టోక్యో పారాలింపిక్స్‌లో టేబుల్‌ టెన్నిస్ మహిళ క్రీడాకారిణి భవీనాబెన్‌ పటేల్‌ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో మహిళల టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. సెమీస్‌లో చేరినప్పుడే ఆమెకు పతకం ఖాయమైనప్పటికీ శనివారం జరిగిన సెమీస్‌ పోరులో గెలిచిన భవీనా ఫైనల్‌కు అడుగుపెట్టింది. ఇక ఫైనల్లో గెలిస్తే బంగారు పతకాన్ని గెలిచే అవకాశం వచ్చింది. అయితే తుది పోరులో చైనా క్రీడాకారిణి.. ప్రపంచ నెంబర్‌వన్‌.. చైనా క్రీడాకారిణి జౌ యింగ్ చేతిలో 3-0తో పరాజయం పాలైంది. టోక్యో పారాలింపిక్స్‌లో దేశానికి రజతం అందించిన భవీనాబెన్‌ పటేల్‌ జీవితం ఒక ఆదర్శం. 12 నెలల వయసులో పోలియో బారీన పడినప్పటికీ జీవితంలో ఆమె సాధించిన విజయాలు స్పూర్తినిస్తాయి.

 

ముందుగా జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన భవీనా ఆ తర్వాత అంతర్జాతీయ టోర్నీలలో పతకాలు సాధించడం మొదలుపెట్టింది. 2011లో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ పారా టీటీ టోర్నీలో భవీనా రజత పతకం సాధించింది. ఆ తర్వాత 2013లో ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం కైవసం చేసుకుంది. ఆ తర్వాత జోర్డాన్, చైనీస్‌ తైపీ, చైనా, కొరియా, జర్మనీ, ఇండోనేసియా, స్లొవేనియా, థాయ్‌లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఈజిప్ట్‌ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలలో భవీనా భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఓవరాల్‌గా ఐదు స్వర్ణాలు, 13 రజత పతకాలు, ఎనిమిది కాంస్య పతకాలను ఆమె గెల్చుకుంది. 2017లో గుజరాత్‌కు చెందిన రాష్ట్రస్థాయి మాజీ క్రికెటర్‌ నికుంజ్‌ పటేల్‌ను వివాహం చేసుకున్న భవీనా 2018 ఆసియా పారా గేమ్స్‌లో డబుల్స్‌ విభాగంలో రజత పతకం సాధించింది.

Related posts