telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఛత్రపతి’ రీమేక్‌ తో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ

Bellamkonda

“అల్లుడు శీను” సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. “కవచం” వరకు అదే పంథాలో నడిచిన ఈ హీరో “సీత” సినిమాతో రూట్ మార్చాడు. భిన్నమైన కథలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తమిళంలో విడుదలైన “రాక్షసన్”ను తెలుగు రీమేక్ “రాక్షసుడు”లో హీరోగా నటించారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా నటించారు. ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కు మంచి విజయాన్ని అందించింది. కాగా ఇప్పుడు ఈ హీరో తన ఎనిమిదో సినిమా చేస్తున్నారు. ఇక ఆయన చేతిలో ఎప్పుడూ రెండు మూడు సినిమాలు లైన్లో ఉంటాయి. యాక్షన్ సినిమాలకు పెద్దపీట వేసే బెల్లంకొండ శ్రీనివాస్‌ను హిందీ ప్రేక్షకులూ ఇష్టపడతారు. ఆయన సినిమాలను హిందీ డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటారు. అవన్నీ మన అగ్ర హీరోలకు ధీటుగా అక్కడ రికార్డ్ వ్యూస్ సాధిస్తూ శ్రీనివాస్ సత్తాను నిరూపిస్తున్నాయి. ప్రస్తుతం ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటిస్తున్న ఆయన త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో 2005లో వచ్చిన ‘ఛత్రపతి’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను 15ఏళ్ల తర్వాత హిందీలో రీమేక్ చేసేందుకు ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ హక్కులు సొంతం చేసుకుంది. హిందీ ప్రేక్షకుల్లో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన్ని ఎంపిక చేసుకున్నారు. యాక్షన్‌ కథల్లో ఒదిగిపోయే శ్రీనివాస్‌కు నిజంగా ఇది బంపరాఫరే అని చెప్పొచ్చు. గతంలోనూ మన హీరోలు చాలామంది బాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ రాణించలేకపోయారు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి. ‘ఛత్రపతి’ రీమేక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Related posts