telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ సామాజిక

జూన్ రెండో వారంలో … చేపమందు పంపిణి ..

bathini brothers fish medicine ready

బత్తిని సోదరులు వంశపారంపర్యంగా ఆస్తమా వంటి వ్యాధుల నివారణకు అందించే చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యదవ్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశం మేరకు జూన్ 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రజలకు చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బత్తిని హరినాథ్‌గౌడ్ కుటుంబీకులు 173 ఏండ్ల నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారని, దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజలు వస్తారని గత సంవత్సరం కంటే మెరుగ్గా ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించామన్నారు.

జూన్ 8న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, తిరిగి జూన్ 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని వివరించారు. అంతకుముందు మంత్రి తలసాని, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి వివిధ శాఖల అధికారులతోసమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల సమన్వయంతో పనిచేయడానికి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేస్తున్నామని, వేసవిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ద్వారా పారిశుద్ధ్యం, మొబైల్ టాయిలెట్స్, రూ.5 భోజనం ఏర్పాట్లుచేయాలని సూచించారు. 150 ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పనుల పరిశీలనకు జూన్ 4న ఉదయం 11 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సమావేశం అవుతామని మంత్రి వివరించారు.

చేప ప్రసాద పంపిణీకి అధికారులు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. సమావేశంలో జేఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఫైర్‌సర్వీసెస్ డీజీ గోపీకృష్ణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్, పిషరీస్ కమిషనర్ సువర్ణ, టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డితోపాటు బత్తిని హరినాథ్‌గౌడ్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related posts