telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

చేపమందు పంపిణీకి అంతా సిద్ధం .. 8,9 తేదీలలో.. లక్షా 60వేల చేపలు …

bathini brothers fish medicine ready

ప్రభుత్వ యంత్రాంగం మృగశిరకార్తె సందర్భంగా జూన్ 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిన సోదరులు ఆస్తామా రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణీకి అన్ని విధాలా ఏర్పాట్లు చేపడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపీణీ ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బత్తిన సోదరులు జూన్ 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి చేప ప్రసాదం పంపీణీ చేస్తారని ఆయన తెలిపారు. వివిధ రాష్ర్టాల నుండి వచ్చే ప్రజల సౌకర్యార్థం రూ. 5 రూపాయల భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రాంమోహన్ మాట్లాడుతూ చేప ప్రసాదం పంపీణీ కార్యక్రమంలో ముఖ్యంగా అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వయోవృద్దులకు, దివ్యాంగులకు వీలుగా వీల్‌చైర్లు ఏర్పాట చేయాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలుగకుండా జీహెచ్‌ఎంసీ తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీసు డి.ఎస్. చౌహాన్ మాట్లాడుతూ మే ఐ హెల్ప్ బూత్‌లతో పాటు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, బందోబస్తు కోసం వివిధ స్థాయిల్లో పని చేసే పోలీస్‌లను నియమించనున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ రవి మాట్లాడుతూ చేప ప్రసాదం పంపీణీ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమీక్షించేందుకు రెవెన్యూ శాఖకు సంబంధించిన 14 మంది తహశీల్దార్‌లు ఒక స్పెషల్ డిప్యూటి కలెక్టరుతో బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపారు. మత్స్య శాఖ కమిషనర్ డాక్టర్ సువర్ణ రాణి మాట్లాడుతూ చేప ప్రసాదం పంపీణీకి అవసరమైన లక్ష 60 వేల చేప పిల్లలను సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలి మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ తరపున 100 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయడమే కాకుండా పారిశుద్ధ్య నిర్వహణకు మూడు షిప్టులలో షిప్టుకు 100 మంది చొప్పున సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌రాథోడ్, కార్పొరేటర్‌లు మమతా సంతోష్ గుప్తా, ముఖేష్‌సింగ్, పరమేశ్వరిసింగ్, టీఆర్‌ఎస్ నాయకులు ఆర్‌వి మహేందర్‌కుమార్, ఎస్ ధన్‌రాజ్, జై శంకర్, హరీష్ గుప్తా, ఆర్ శంకర్‌లాల్ యాదవ్, బెజిని శ్రీనివాస్, ఆనంద్‌సింగ్, కోటి శైలేష్‌కురుమ తదితరులు పాల్గొన్నారు.

శాస్త్రీయత లేని చేప ప్రసాదంపై ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నదని బాలల హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. బత్తిని హరినాథ్‌గౌడ్ కుటుంబం నిర్వహిస్తున్న బత్తిని మృగశిర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేప ప్రసాదం పంపిణీ ప్రైవేటు కార్యక్రమమని, ప్రైవేటు కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని పిటిషనర్ తెలిపారు. ఉచితంగా చేప పిల్లలను సరఫరా చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా, జీవో ఇవ్వకుండా నిధులు ఖర్చు చేస్తున్నారని, నోటి మాట ద్వారా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ప్రైవేటు కార్యక్రమమైనా భారీ సంఖ్యలో ప్రజలు ఒకచోట చేరినప్పుడు వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొన్నది.

Related posts