telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

బాసరలో కీచక గురువు : .. ఇంటికొస్తేనే .. పాస్ చేస్తా అంటూ వికారం వెళ్లగక్కుతున్న ప్రొఫెసర్..

women abusing child for a year

గురువు స్థానంలో ఉంది కూడా అతని బుద్ధి వక్రంగానే ఉంది. ఫెయిలైన విద్యార్థినులను కోరిక తీరిస్తే పాస్‌ చేయిస్తానంటూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్‌ బాగోతం బట్టబయలైంది. తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌ జిల్లా బాసరలోని ట్రిపుల్‌ ఐటీలో ఈ బాగోతం బయటపడడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అంతర్గతంగా విచారణ జరిపిన అధికారులు అతన్ని విధుల నుంచి తొలగించారు. బాసర ట్రిపుల్‌ ఐటీ కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రవి వరాల పీయూసీ-2 సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థినికి మెసేజ్‌ పంపాడు. ‘నిజామాబాద్‌లో ఉన్న మా ఇంటికి రా, ఇదే నా అడ్రస్‌. నిన్ను పాస్‌ చేయిస్తా’ అన్నది ఆ మెసేజ్‌ సారాంశం. సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వచ్చిన బాలిక నిన్న వర్సిటీ నుంచి తిరిగి ఇంటికి బయలుదేరింది. వర్సిటీ నిబంధనల ప్రకారం విద్యార్థినులకు ఔట్‌పాస్‌ ఇచ్చే ముందు విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడాలి. దీంతో వార్డెన్‌ ఔట్‌ పాస్‌ ఇచ్చే ముందు మీ నాన్నతో మాట్లాడించు అని సదరు విద్యార్థినికి సూచించింది. ఇందుకోసం ఆమె ఫోన్‌ తీసుకుని ఆమె తండ్రి ఫోన్‌కి డయల్‌ చేస్తుండగా, అదే సమయంలో సదరు ప్రొఫెసర్‌ పంపిన మెసేజ్‌ విద్యార్థిని సెల్‌కి వచ్చింది.

వార్డెన్‌ ఆ మెసేజ్‌ చదివి ఆశ్చర్యపోయారు. వెంటనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అప్రమత్తమైన అధికారులు సదరు విద్యార్థినిని తొలుత విచారించగా ‘ఇంటికొస్తే పాస్‌ చేయిస్తానని సార్‌ చెప్పారు’ అంటూ చెప్పడంతో అవాక్కయ్యారు. దీంతో అధికారులు బాలిక తల్లిదండ్రులను కూడా పిలిపించి వారి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. ఈ లైంగిక వేధింపుల వివాదాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు నిన్న సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న వర్సిటీ వీసీ అశోక్‌కు జరిగిన విషయంపై సమాచారం అందించారు. అనంతరం విద్యార్థిని స్టేట్‌మెంట్‌ మేరకు రవి వ్యవహారంపై అంతర్గత విచారణ జరిపించారు. విచారణ కమిటీ నివేదిక మేరకు ఆయన్ను విధుల నుంచి తొలగించారు.

Related posts