telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారత్ బంద్.. అన్ని బందే ..

barath band in progress

కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు తలపెట్టిన భారత్ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. పలు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు కేరళలో భారత్ బంద్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. కేరళతో పాటు పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ వంటి బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జనజీవనంపై బంద్ ప్రభావం పడింది. బ్యాంకింగ్, రవాణా వ్యవస్థలు దాదాపుగా స్తంభించిపోయాయి. వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు బలంగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో బంద్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఉత్తర 24 పరగణా జిల్లాలో రైళ్ల రాకపోకలను ప్రదర్శనకారులు అడ్డుకున్నారు. కంచ్రాపారాలో పట్టాలపై బైఠాయించారు. నిరసన ప్రదర్శనలను దిగారు. రాజధాని కోల్‌కత, హౌరా, దక్షిణ పరగణా, సిలిగురి వంటి జిల్లాల్లో దాదాపు ఇదే తరహా వాతావరణం నెలకొంది. మొత్తం పదికి పైగా కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ బంద్‌లో పాల్గొంటున్నారు.

డజనుకుపైగా కార్మిక సంఘాలు.. ఐఎన్ టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, సేవా, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ వంటి కార్మిక సంఘాలతో పాటు వివిధ రంగాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న స్వతంత్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సమాఖ్యలు, అసోసియేషన్లు భారత్ బంద్ లో పాల్గొంటున్నాయి. ఊహించినట్టుగానే- బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బంద్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. భారత్ బంద్ ప్రభావం.. ప్రత్యేకించి బ్యాంకింగ్ రంగంపైనా తీవ్రంగా పడింది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న కార్మిక, ఉద్యోగ సంఘాలతో కూడిన బ్యాంకింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) భారత్ బంద్ కు మద్దతు ఇచ్చింది. ఈ ఫెడరేషన్ లో సుమారు పది వరకు వివిధ అసోసియేషన్లు పని చేస్తున్నాయి. భారత్ బంద్ సందర్భంగా ఆయా సంఘాల ఉద్యోగులు, కార్మికులు విధులను బహిష్కరించాయి.

Related posts