telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

బంగ్లా లక్ష్యం.. భారీగానే ఇచ్చిన భారత్.. గెలుపు ఖాయమే.. !

bangladesh got huge target by India

ప్రపంచకప్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌-భారత తలపడుతున్న సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(104; 92బంతుల్లో 7×4, 5×6)శతకంతో చెలరేగిపోయాడు. కేఎల్‌ రాహుల్‌(77; 92బంతుల్లో 6×4, 1×6), రిషభ్‌ పంత్‌(48; 41బంతుల్లో 6×4, 1×6) అర్ధశతకాలతో రాణించడంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ 5 వికెట్లు పడగొట్టాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆరంభం నుంచే ధీటుగా ఆడుతూ వచ్చిన రోహిత్‌-రాహుల్‌ జోడీ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఇదే దూకుడులో షకిబ్‌ బౌలింగ్‌లో 15 ఓవర్‌లో రోహిత్‌ అర్ధశతకం అందుకున్నాడు. కాసేపటికే కేఎల్‌ రాహుల్‌ కూడా 19ఓవర్‌లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తర్వాతి నుంచి రోహిత్‌ మరింత వేగంగా ఆడుతూ వచ్చాడు. రాహుల్‌ను నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌కు పరిమితం చేసి హిట్‌మ్యాన్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అదే జోరు మీద 29ఓవర్‌లో సెంచరీ సాధించాడు. ఈ టోర్నీలో అతనికిది నాలుగో శతకం. కానీ తర్వాతి ఓవర్‌లో సౌమ్య సర్కార్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడిన రోహిత్‌(104) లిటన్‌ దాస్‌ చేతికి చిక్కాడు. తొలి వికెట్‌కు భారత్‌ 180పరుగులు సాధించింది.

ఈ ప్రపంచకప్‌లో భారత్‌కిదే అత్యుత్తమ ఓపెనింగ్‌ భాగస్వామ్యం. తర్వాతి నుంచి బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తూ వచ్చారు. 33 ఓవర్‌లో రూబెల్‌ బౌలింగ్‌లో రాహుల్‌(77) పెవిలియన్‌కు చేరుకున్నాడు. క్రీజులోకి వచ్చిన పంత్‌తో సారథి కోహ్లీ ఇన్నింగ్స్‌ నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ 39ఓవర్‌లో బంతి అందుకున్న ముస్తాఫిజుర్‌ వెంటవెంటనే కోహ్లీ(26), పాండ్య(0)లను పెవిలియన్‌కు పంపి భారత్‌పై ఒత్తిడి పెంచాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో అడ్డదిడ్డంగా ఆడిన పంత్‌(48) ఈ మ్యాచ్‌లో మాత్రం ఆచితూచి ఆడాడు. కేవలం చెత్త బంతులనే శిక్షిస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. 40 ఓవర్‌లో సైపుద్దీన్‌ బౌలింగ్‌లో మూడు బౌండరీలు బాది జోరు పెంచాడు. కానీ అర్ధశతకానికి చేరువయ్యే క్రమంలో 45 ఓవర్‌లో షకిబ్‌ బౌలింగ్‌లో మోసాదిక్‌ చేతికి చిక్కడంతో పంత్‌ పోరాటం ముగిసింది. దినేశ్‌ కార్తీక్‌(8) నిరాశపరిచాడు. చివరి ఓవర్లో ముస్తాఫిజుర్‌ ధోనీ(35; 33బంతుల్లో 4×4), షమి(1), భువనేశ్వర్‌(2) రనౌట్‌ చేశాడు. ఓపెనర్లు మంచి ఆరంభమే ఇచ్చినా… బంగ్లా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి భారత్‌ను కట్టడి చేశాడు.

Related posts